సంక్షోభం అంచున భారత ఆర్థిక వ్యవస్థ.. ఎరువులపై సబ్సిడీ విధానం మార్చాల్సిందే: అగ్రి ఎకానమిస్ట్

సంక్షోభం అంచున భారత ఆర్థిక వ్యవస్థ.. ఎరువులపై సబ్సిడీ విధానం మార్చాల్సిందే: అగ్రి ఎకానమిస్ట్

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక పెద్ద సంక్షోభం అంచున నిలిచి ఉందని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, సీనియర్ ఫెలో రితికా జునేజా హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా దేశంలో ఇంధనం, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. విదేశీ పెట్టుబడిదారులు దేశం నుండి డబ్బును వెనక్కి తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం గనుక తక్షణమే మేల్కొని సబ్సిడీల వ్యవస్థను పూర్తిగా మార్చకపోతే.. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఏకంగా రూ.100 కి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్6 శాతం జీడీపీ వృద్ధిని సాధించడం.. ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు ఉంచడం కూడా చాలా కష్టమని ఈ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అంతర్జాతీయంగా కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గనుక మరో 3 నెలల పాటు మూతబడితే.. జీడీపీ వృద్ధి రేటు 6 శాతం కంటే కిందకు పడిపోతుందని, ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచక తప్పదని ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే దేశంలో 1991 నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో తెచ్చినట్లు నిర్మాణాత్మక సంస్కరణలను మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా దేశంలోని రసాయన ఎరువుల సబ్సిడీ విధానంపై వారు తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం తన యూరియా అవసరాల్లో 20-25 శాతాన్ని దిగుమతి చేసుకుంటోందని, ప్రస్తుతం ఒక టన్ను యూరియా దిగుమతి ఖర్చు దాదాపు 935 డాలర్లు అంటే రూ.89 వేలకు పైగా అవుతోందని తెలిపారు. అయితే ప్రభుత్వం దీనిపై దాదాపు 90 శాతం సబ్సిడీ ఇస్తూ.. రైతులకు కేవలం 70 డాలర్ల లోపు ధరకే అందిస్తోందని గుర్తుచేశారు. ఈ భారీ ధరల వ్యత్యాసం వల్ల సబ్సిడీ ఎరువులు పక్కదారి పడుతున్నాయని.. బీహార్ సరిహద్దుల గుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాలకు భారీగా స్మగ్లింగ్ అవుతున్నాయని ఆధారాలతో సహా పేర్కొన్నారు.

ఈ ఎరువుల సబ్సిడీల భారం బడ్జెట్‌లో అనుకున్న రూ.లక్షా 71వేల కోట్ల నుండి ఏకంగా రూ.2లక్షల 50వేల కోట్లకు చేరే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. దీనికి అంతిమ పరిష్కారంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని చెబుతున్నారు. ఎరువుల సబ్సిడీని నేరుగా రైతుల భూమి విస్తీర్ణం ఆధారంగా పీఎం-కిసాన్ పథకంతో లింక్ చేసి వారి అకౌంట్లలో వేయడం ద్వారా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడటమే కాకుండా.. ప్రభుత్వానికి ఏటా రూ.40వేల నుంచి రూ.50వేల కోట్ల వరకు ఆదా అవుతుందని లెక్కగట్టారు.

అలాగే దేశంలో అమలవుతున్న ఉచిత రేషన్ పథకంపై కూడా వారు ప్రశ్నలు గుప్పించారు. దేశంలో పేదరికం భారీగా తగ్గిందని ప్రభుత్వం చెబుతున్నప్పుడు.. ఇంకా 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం, సరుకులు పంపిణీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ లబ్ధిదారుల జాబితాను హేతుబద్ధీకరించి, పేదరిక రేఖకు పైన ఉన్నవారికి ధరలను కొద్దిగా పెంచడం ద్వారా ఏడాదికి మరో రూ.50వేల కోట్లను ఆదా చేయవచ్చని సూచించారు. రాజకీయంగా కఠినమైనప్పటికీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే అది ప్రభుత్వ విధానపరమైన పిరికితనం అవుతుందని చెప్పారు.