గ్రానైట్ కంపెనీల్లో కొనసాగిన తనిఖీలు

గ్రానైట్ కంపెనీల్లో కొనసాగిన తనిఖీలు

కరీంనగర్/ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: కరీంనగర్ జిల్లాలో గురువారం రెండో రోజూ ఈడీ, ఐటీ దాడులు కొనసాగాయి. సిటీ చుట్టుపక్కల కొత్తపల్లి మండలం నాగులమల్యాల, బావుపేట ఏరియాల్లో ఉన్న ఐదారు గ్రానైట్ కంపెనీల్లో అధికారులు సోదాలు చేశారు. నాగులమల్యాల రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్(ఎస్ వీజీ) కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. ఆ టైమ్ లో మీడియా అక్కడికి వెళ్లగా, ఆఫీస్ కనిపించకుండా ఓనర్ లారీలు అడ్డు పెట్టించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు అధికారుల సోదాలు కొనసాగాయి. ముఖ్యంగా ఫెమా నిబంధనలను ఉల్లంఘించి రాయల్టీ ఎగ్గొట్టడంపై వివరాలు సేకరించినట్లు సమాచారం. గతంలో ఎన్ని బ్లాకుల గ్రానైట్ తీశారు? ఎంత విదేశాలకు ఎగుమతి చేశారు? దానికి సంబంధించిన లావాదేవీలు? తదితరాలను పరిశీలించినట్లు తెలిసింది. గతంలో అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ రాయల్టీ ఎగ్గొట్టిన కంపెనీలపైనే ఈడీ ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం కూడా దాడులు కొనసాగుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఖమ్మంలో కొనసాగిన ఐటీ దాడులు..  
ఖమ్మంలో గురువారం రెండో రోజూ ఐటీ దాడులు కొనసాగాయి. సిటీలోని పలు హాస్పిటళ్లలో అధికారులు సోదాలు చేశారు. వైరా రోడ్డులోని రోహిత్​టెస్ట్​ట్యూబ్​బేబీ సెంటర్, బిలీఫ్​హాస్పిటల్, శ్రీరాం కిడ్నీ సెంటర్లలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఐటీ అధికారులు బిలీఫ్​హాస్పిటల్​కు వస్తున్నట్టు తెలుసుకున్న మేనేజ్ మెంట్.. పలు కీలక డాక్యుమెంట్లు, నోట్ల కట్టలను బస్తాలలో నింపి దొడ్డిదారిన తరలించినట్లు సమాచారం. దీన్ని పసిగట్టిన ఐటీ అధికారులు దవాఖానా వెనుక నివసిస్తున్న కొందరిని అడిగి వివరాలు సేకరించినట్టు తెలిసింది. రానున్న రోజుల్లో మరికొన్ని దవాఖాన్లపై దాడులు జరిగే అవకాశముందని సమాచారం.

నోటీసులేం రాలే: గంగుల 
దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఎంక్వయిరీకి సహకరించేందుకే తాను దుబాయ్ నుంచి వచ్చానని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. గురువారం ఆయన కరీంనగర్ లోని డాక్టర్ స్ట్రీట్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను విచారణకు హాజరు కావాలని దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఏ వివరాలు అడిగినా ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎంపీ వద్దిరాజు ఇంట్లో సోదాలు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులను ఎంపీ వద్దిరాజు గురువారం ఖండించారు. తన కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువైన గంగుల కుటుంబానికి సంబంధించిన గాయత్రి, శ్వేత గ్రానైట్ కంపెనీలపై ఈడీ, ఐటీలు దాడులు చేయడం దారుణమన్నారు. దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు మంచి పరిణామం కాదన్నారు. ఉమ్మడి ఏపీలో జరిగిన గ్రానైట్‌‌ఎక్స్‌‌పోర్ట్‌‌పై రాజకీయ కోణంలో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం రాత్రి ఈడీ, ఐటీ అధికారులు తమ ఇంట్లో సోదాలు జరిపినట్లు వెల్లడించారు. గాయత్రి గ్రానైట్ కంపెనీలో రాత్రి వరకు సెర్చ్‌‌ జరిగిందన్నారు. తమ ఇంట్లో ఉన్న గంగుల ఆఫీస్​ను సీజ్ చేశారని చెప్పారు. పంచనామా  చేసి నోటీసులిచ్చారన్నారు. గ్రానైట్‌‌ వ్యాపారంలో ఎలాంటి మోసాలకు పాల్పడలేదని చెప్పారు. గ్రానైట్ పరిశ్రమ 75% నష్టాలు ఎదుర్కొంటోందని, ఈ ఇండస్ట్రీని ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఆయన విజ్ఞప్తి చేశారు.