ఎర్రకోట పేలుళ్ల కేసులో బిగ్ ట్విస్ట్: అల్-ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ సిద్ధిఖీ అరెస్ట్

ఎర్రకోట పేలుళ్ల కేసులో బిగ్ ట్విస్ట్: అల్-ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ సిద్ధిఖీ అరెస్ట్

న్యూఢిల్లీ: ఎర్రకోట్ల పేలుళ్ల కేసుతో లింకులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, అల్-ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీ అరెస్ట్ అయ్యాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లోని సెక్షన్ 19 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధిఖీని అరెస్టు అరెస్ట్ చేసింది. 

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎర్రకోట కారు బాండు పేలుడు నిందితులకు అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఇక్కడి నుంచే నిందితులు దాడులకు కుట్ర చేసినట్లు ఏజెన్సీలు గుర్తించాయి. NAAC అక్రిడిటేషన్ లేకున్నా ఉన్నట్లుగా అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం విద్యార్థులను తప్పుదారి పట్టించినట్లు గుర్తించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ మేరకు అల్-ఫలాహ్ యూనివర్శిటీపై రెండు కేసులు నమోదు చేశారు. 

అల్-ఫలాహ్ యూనివర్శిటీలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ECIR నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అల్-ఫలాహ్ యూనివర్శిటీ, చైర్మన్ సిద్ధిఖీ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. సిద్ధిఖీని అదుపులోకి తీసుకుని విచారించింది. నిధుల మళ్లింపు, మనీలాండరింగ్‎కు పాల్పడినట్లు నిర్ధారించుకుని మంగళవారం (నవంబర్ 18) అరెస్ట్ చేసింది ఈడీ. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారన్న కోణంలో కూడా ఈడీ ఆరా తీస్తోంది. 

2025,  నవంబర్ 11న ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ కారులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏన్ఐఏ విచారణ వేగవంతం చేసింది.