శ్రీశరణ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు .. ఇంట్లో ఈడీ  సోదాలు 

శ్రీశరణ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు .. ఇంట్లో ఈడీ  సోదాలు 
  • ఆయన ఇంట్లో ఈడీ  సోదాలు 

హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కామ్‌‌‌‌లో కవిత మేనల్లుడు మేక శ్రీశరణ్‌‌‌‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. రూ.100 కోట్ల తరలింపులో ఆయన కీలకపాత్ర పోషించినట్టు ఈడీ గుర్తించిందని తెలిసింది. ఇటీవల కవిత ఇంట్లో సోదాల టైమ్ లో శ్రీశరణ్ ఫోన్ సీజ్ చేసిన ఈడీ.. సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ డేటా ఆధారంగా విచారణకు రావాలని ఆయనను పిలిచింది. అయితే శ్రీశరణ్ విచారణకు వెళ్లకపోవడంతో శనివారం హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మాదాపూర్‌‌‌‌‌‌‌‌లోని డీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ రేగంటి అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ సహా కవిత భర్త అనిల్‌‌‌‌ బంధువుల ఇండ్లలోనూ తనిఖీలు చేసింది. శ్రీశరణ్ ఇంట్లో ఏడుగురు సభ్యుల బృందం ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. 

షెల్‌‌‌‌ కంపెనీలతో శ్రీశరణ్​కు లింకులు.. 

లిక్కర్ స్కామ్‌‌‌‌లో ముడుపుల తరలింపునకు షెల్‌‌‌‌ కంపెనీలను వినియోగించినట్టు ఇప్పటికే ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో పలు షెల్‌‌‌‌ కంపెనీల పేరుతో శ్రీశరణ్‌‌‌‌ లావాదేవీలు జరిపినట్టు ఈడీ అనుమానిస్తున్నది. హైదరాబాద్ నుంచి రూ.100 కోట్లు ఢిల్లీ, గోవా, పంజాబ్‌‌‌‌ కు తరలించడంలో శ్రీశరణ్‌‌‌‌ కీలకపాత్ర పోషించినట్టు ఈడీ గుర్తించిందని తెలిసింది. హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్టు ఆధారాలు సేకరించింది.