నటి రన్యా రావుకు ఈడీ షాక్.. రూ.102 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు!

నటి రన్యా రావుకు ఈడీ షాక్.. రూ.102 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు!

కన్నడ నటి రన్యారావు చుట్టూ మనీలాండరింగ్ ఉచ్చు బిగుస్తోంది. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో ఆమె కీలక పాత్ర పోషించిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.  లేటెస్ట్ గా బెంగళూరులోని పీఎంఎల్ఏ (PMLA) ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు ఈమెపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులు జైలుపాలైన రన్యారావుకు మరిన్ని కష్టాలు తప్పేలాలేదు.

అసలేం జరిగిందంటే?

ఈ కేసు అసలు కథ 2025 మార్చి 3న మొదలైంది. దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆమె శరీరంపై బ్యాండేజీలతో చుట్టుకుని, షూలలో దాచి తరలిస్తున్న 14.2 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ12.56 కోట్లుగా లెక్కకట్టారు. చివరకు రన్యారావు ను పోలీసులు అరెస్ట్ చేశారు...

నెట్ వర్క్ వెనుక ఉన్నది ఎవరు?

ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 2024 నుంచి మార్చి 2025 మధ్య కాలంలో ఈ ముఠా సుమారు 127.28 కిలోల బంగారాన్ని భారత్‌లోకి అక్రమంగా తరలించినట్లు ఈడీ గుర్తించింది. దీని మొత్తం విలువ రూ.102 కోట్లకు పైగా ఉందని నిర్థారించారు. ఈ స్మగ్లింగ్ లో రన్యారావు ప్రధాన పాత్ర దారి.  ఆమెకు అత్యంత సన్నిహితుడు తరుణ్ కొండూరు , బెళ్లారికి చెందిన బంగారు వ్యాపారిసాహిల్ సకారియా జైన్ కూడా ఈకేసులు ఉన్నారు.

హవాలా మార్గంలో వేల కోట్లు!

స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని స్థానిక వ్యాపారులకు నగదు రూపంలో విక్రయించి, ఆ సొమ్మును 'హవాలా' ఛానెల్స్ ద్వారా విదేశాలకు పంపేవారని ఈడీ పేర్కొంది. రన్యా రావు దుబాయ్‌లో 'వీరా డైమండ్స్' అనే సంస్థను నడుపుతూ, అక్కడ నుంచి బంగారాన్ని అక్రమంగా భారత్ పంపేదని దర్యాప్తులో తేలింది. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా, విదేశీ లావాదేవీలను నియంత్రించే సంస్థలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలిస్తాయి అని ఈడీ తన ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించింది.

ఆస్తులు ఈడీ అటాచ్..

ఈ కేసులో రన్యా రావుకు చెందిన రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. గతంలోనే డీఆర్ఐ (DRI) ఈమెకు సుమారు రూ.102 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  ఇప్పటికే కోఫెపోసా (COFEPOSA) చట్టం కింద రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష పడగా, ఆమె ప్రస్తుతం బెంగళూరు కేంద్ర కారాగారంలో ఉంది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్తె అయి ఉండి, గ్లామర్ ప్రపంచంలో ఉంటూ ఇలాంటి నేరాలకు పాల్పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.