వేదాంత ఆఫీసులపై ఈడీ దాడులు..ఫెమా రూల్స్ ఉల్లంఘన కేసులో విచారణ

వేదాంత ఆఫీసులపై ఈడీ దాడులు..ఫెమా రూల్స్ ఉల్లంఘన కేసులో విచారణ

న్యూఢిల్లీ: బిలియనీర్​ అనిల్ అగర్వాల్‌‌‌‌కు చెందిన వేదాంత గ్రూప్‌‌‌‌పై ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన కేసులో విచారణను ప్రారంభించింది. ఈ సంస్థ అధికారిక కార్యాలయాల్లో సోదాలు చేసింది. ఈ గ్లోబల్ మైనింగ్ కంపెనీకి వ్యతిరేకంగా సోమవారం దాడులు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌‌‌‌లోని ఉదయ్‌‌‌‌పూర్ నగరాల్లో కంపెనీ ఆఫీసుల్లో సర్వేలు నిర్వహించారు. 

ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌‌‌‌మెంట్ యాక్ట్ (ఫెమా) సివిల్ నిబంధనల ప్రకారం ఈ విచారణ జరుగుతోంది. లండన్ కేంద్రంగా పనిచేసే వేదాంత రిసోర్సెస్ సంస్థ, భారతీయ అనుబంధ సంస్థ వేదాంత లిమిటెడ్‌‌‌‌కు 2023లో బ్రాండ్ ఫీజులో కొంత భాగాన్ని తిరిగి చెల్లించడాన్ని ఈడీ పరిశీలిస్తోంది.  గ్రూప్ ఇతర నిర్మాణాలను కూడా పరిశీలిస్తోంది.  అధికారులు కోరిన అన్ని వివరాలను ఇస్తూ పూర్తి సహకారం అందిస్తున్నట్లు వేదాంత తెలిపింది.  తమ  కంపెనీ చట్టాలకు కట్టుబడి ఉందని పేర్కొంది.