మోదీ బెదిరింపులకు భయపడం.. పినరయి విజయన్పై ఈడీ దాడులు రాజకీయ కక్షసాధింపే: సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

మోదీ బెదిరింపులకు భయపడం.. పినరయి విజయన్పై ఈడీ దాడులు రాజకీయ కక్షసాధింపే: సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

ముషీరాబాద్, వెలుగు: మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీ నాయకులపై కేసులు పెడితే బెదిరిపోయే ప్రసక్తే లేదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. మోదీ సర్కార్ చర్యలకు భయపడబోమని, ప్రతిఘటన ఉద్యమాలతో మరింత బలపడతామని హెచ్చరించారు. 

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్​పై ఈడీ దాడులను నిరసిస్తూ గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంబీ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు సాగిన ర్యాలీలో జాన్ వెస్లీ, బీవీ రాఘవులు పాల్గొన్నారు.  ‘‘ఈడీ, మోదీ గో బ్యాక్.. గో బ్యాక్’’ అంటూ నినాదాలు చేశారు. 

అనంతరం రాఘవులు మాట్లాడుతూ.. మాజీ సీఎంపై ఒక్క అవినీతి కేసు కూడా లేదని, ఇది ముమ్మాటికి రాజకీయ దాడి అని పేర్కొన్నారు. విచారణ పేరుతో దాడులు చేయడం వామపక్షాలను దెబ్బతీయడంలో భాగమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ స్వలాభం కోసం ముందుచూపు లేకుండా బీజేపీకి సహకారం అందిస్తోందని ఫైరయ్యారు. ఈ కుట్రలో కాంగ్రెస్ భాగస్వామ్యమైందని, గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై సీబీఐ దాడులు జరిగినప్పుడు ముక్తకంఠంతో సీపీఐ(ఎం) ఖండించిందని గుర్తు చేశారు.