
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా దర్యాప్తు
- అతని సోదరుడు నవీన్‌కుమార్ ఇంట్లోనూ తనిఖీలు
- శివబాలకృష్ణ షెల్ కంపెనీలపైనా ఈడీ నజర్
హైదరాబాద్, వెలుగు: హెచ్‌ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్, రెరా మాజీ సెక్రటరీ శివబాలకృష్ణపై ఈడీ కేసు నమోదు చేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచి మణికొండ పుప్పాలగూడలోని ఆయన నివాసంతో పాటు అతని సోదరుడు నవీన్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. బ్యాంక్ లావాదేవీలు, స్థిర చరాస్తులు, గత ఐదేండ్ల ఐటీ చెల్లింపులు సహా వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదుతో గతేడాది జనవరి 24న ఏసీబీ అధికారులు శివబాలకృష్ణపై కేసు నమోదు చేశారు. రూ.40 లక్షలకు పైగా నగదు,125 ఇంపోర్టెడ్ వాచీలు, 20కి పైగా అత్యంత ఖరీదైన సెల్‌ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం దాదాపు రూ.250 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బును శివబాలకృష్ణ వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఆధారాలు సేకరించారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేశారు. సోదాల్లో ఏసీబీ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, సీజ్ చేసిన నగదు, బినామీ ఆస్తుల వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
హెచ్‌ఎండీఏ, రెరా అడ్డాగా శివబాలకృష్ణ అవినీతి!
శివబాలకృష్ణ గత ప్రభుత్వ హయాంలో హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. గతేడాది జనవరి వరకు రెరా సెక్రటరీగా పనిచేశాడు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో ‘చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్’ ప్రక్రియలో పెండింగ్ ఫైల్స్‌ను అక్రమంగా క్లియర్ చేసినట్టు ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. రెరా సెక్రటరీగా హెచ్‌ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్‌కంపెనీలకు లబ్ధి చేకూరే విధంగా లాబీయింగ్ నడిపినట్టు అప్పట్లో ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. శివబాలకృష్ణ తల్లి భారతి, భార్య రఘుదేవి, కూతురు పద్మావతి, కుమారుడు హరిప్రసాద్ తో పాటు బినామీల పేర్లతో 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్లు, 8 ఇండ్లు, ఇతర స్థిరచరాస్తులను కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
రెడీమేడ్ డ్రెసెస్ పేరుతో షెల్ కంపెనీలు
ఆస్తుల కొనుగోలు కోసం శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ఫేక్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాడు. ఇందుకుగాను నవీన్ తన భార్య అరుణ పేరుతో సౌందర్య బోటిక్, సౌందర్య రెడీమేడ్స్ పేరుతో నకిలీ సంస్థలను ఏర్పాటు చేశాడు. శివబాలకృష్ణ భార్య రఘుదేవి.. దేవి శారీ సెంటర్ పేరుతో వ్యాపారం చేస్తున్నట్టు చూపించారు. ఇలాంటి షెల్ సంస్థల ద్వారా రఘుదేవి, అరుణ పేర్లతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారు. శివబాలకృష్ణ భార్య రఘుదేవిపై ఆదాయాన్ని పెంచి చూపేందుకు ప్లానింగ్ ఆర్గనైజేషన్‌లో ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్ ఇప్పించాడు. ఈ క్రమంలోనే శివబాలకృష్ణ కూతురు పద్మావతి పేరుతో కూడా 2017–2018 నుంచి ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. ఆ సమయంలో పద్మావతి మైనర్. హోమ్ ట్యూషన్స్ చెప్పడం ద్వారా ఆదాయం సమకూరుతున్నదని సర్టిఫికెట్స్ క్రియేట్ చేశారు. ఇలా హోం ట్యూషన్స్‌తో తన కూతురు పేరున ఐటీ దాఖలు చేసేవారు. ఈ మేరకు ఈడీ అధికారులు మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.