ఇండోస్పిరిట్ వాటాల్లో కవితే అసలైన పెట్టుబడిదారు

ఇండోస్పిరిట్ వాటాల్లో కవితే అసలైన పెట్టుబడిదారు

ఇండోస్పిరిట్ వాటాల్లో కవితే అసలైన  పెట్టుబడిదారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌ సప్లిమెంటరీ చార్జ్‌‌షీట్‌‌లో ఈడీ
కవిత బినామీనని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు వెల్లడి
278 పేజీల చార్జ్ షీట్‌‌లో 53 సార్లు కవిత పేరు ప్రస్తావన
4వ సప్లిమెంటరీ చార్జ్‌‌షీట్‌‌ను పరిగణనలోకి తీసుకున్న 
సీబీఐ స్పెషల్ కోర్టు జూన్ 1న తదుపరి విచారణ

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఎన్ ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్‌‌మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది. లిక్కర్ స్కామ్‌‌కు సంబంధించి ఇటీవల ఈడీ దాఖలు చేసిన 4వ సప్లిమెంటరీ చార్జ్‌‌షీట్‌‌ను ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు మంగళవారం పరిగణనలోకి తీసుకొంది.

తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. 278 పేజీల సప్లిమెంటరీ చార్జ్ షీట్‌‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ 53 సార్లు ప్రస్తావించింది. సౌత్ గ్రూప్‌‌లో ఆమె పాత్ర, నిందితులు అరుణ్ రామ చంద్ర పిళ్లై, బుచ్చిబాబు, సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, దినేశ్‌‌ అరోరాతో ఉన్న  సంబంధాలను వారి స్టేట్‌‌మెంట్ల రూపంలో మెన్షన్ చేసింది. ముఖ్యంగా ఇండో స్పిరిట్ (ఎల్1) కంపెనీలో కవిత ఇన్వెస్ట్ మెంట్‌‌పై పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాన్ని వివరించింది. 

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, మాగుంట రాఘవ, అమన్ దీప్ ధల్ సహా మొత్తం 29 మందిని నిందితులుగా ఈడీ చేర్చింది. సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌లో సిసోడియా పేరును చేర్చినట్లు వెల్లడించింది. లిక్కర్ స్కామ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి తెలంగాణ, ఏపీతోపాటు 191 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి ఆధారాలు సేకరించినట్లు తెలిపింది. 12 మంది అరెస్ట్ కాగా, శరత్ చంద్రా రెడ్డి మధ్యంతర బెయిల్‌‌‌‌‌‌‌‌పై బయట ఉన్నట్లు పేర్కొంది.

కవిత బినామీనని ఒప్పుకున్న పిళ్లై

ఇండో స్పిరిట్ (ఎల్1)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరించినట్లు అరుణ్ రామ చంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. ఈ స్కామ్‌‌‌‌‌‌‌‌లో ఇతర విషయాల్లో పిళ్లై కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడించింది. గతేడాది నవంబర్ 11న పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంలో తాను కవితకు బదులు భాగస్వామిగా వ్యవహరించినట్లు పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ (ఎల్1) లో యాక్సెస్‌‌‌‌‌‌‌‌ వచ్చిందంటూ పిళ్లై ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఈడీ ప్రస్తావించింది. కవిత తెలంగాణ సీఎం కూతురని లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రుకు పిళ్లై వివరించినట్లు తెలిపింది.

మరోసారి విందులో పిళ్లై ఫోన్ ద్వారా ‘ఫేస్ టైమ్‌‌‌‌‌‌‌‌’లో సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కవితతో మాట్లాడించినట్లు వివరించింది. ఈ సందర్భంగా కవిత, సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభినందించడమే కాకుండా, లిక్కర్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపింది. కవిత, అరుణ్ పిళ్లైలు ఆప్ నేత, లిక్కర్ స్కామ్‌‌‌‌‌‌‌‌లో కీలకమైన విజయ్ నాయర్, దినేశ్‌‌‌‌‌‌‌‌ అరోరాలను గతేడాది ఏప్రిల్ 8న ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌‌‌‌‌‌‌‌లో కలిసినట్లు పేర్కొంది. 2022లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో కవితను, సమీర్ కలిశారని, ఈ భేటీలో శరత్ చంద్రా రెడ్డి, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు ప్రస్తావించింది.

రూ.100 కోట్లని తెలిసింది అప్పుడే

కవిత, సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో మీటింగ్‌‌‌‌‌‌‌‌లో అనేక సార్లు ‘ఫేస్ టైమ్‌‌‌‌‌‌‌‌’లో పాల్గొన్న పిళ్లై.. హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లోనూ ప్రత్యక్షంగా హాజరైనట్లు ఈడీ చెప్పింది. ఆ తర్వాత జరిగిన చర్చల్లో రూ.100 కోట్లు కిక్ బ్యాక్ గురించి తనకు తెలిసినట్లు పిళ్లై ఒప్పుకున్నాడని పేర్కొంది. పాలసీ రూపకల్పనకు ముందు, తర్వాత కవిత అనేక మార్లు విజయ్ నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భేటీ అయినట్లు తెలిపింది. ఢిల్లీలో జరిగిన భేటీల్లోనూ కవితతో కలిసి పిళ్లై పాల్గొన్నాడని, ఆ తర్వాత పిళ్లై తన భాగస్వాములైన అభిషేక్, బుచ్చిబాబులతో కలిసి విజయ్ నాయర్, సమీర్ మహేంద్రులతో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడినట్లు అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చాడని స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో అన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సిసోడియా నుంచి విజయ్ నాయర్ అనుమతులు పొందినట్లు ప్రస్తావించింది.

ఆ ముగ్గురి మధ్య అవగాహన

లిక్కర్ వ్యాపారంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ కవితల మధ్య అవగాహన ఉందని కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఈడీ ప్రస్తావించింది. పాలసీ రూపకల్పనలో చేయాల్సిన మార్పుల వివరాలను ‘సిగ్నల్’లో బుచ్చిబాబుకు విజయ్ నాయర్ పంపినట్లు తెలిపింది. తర్వాత ఢిల్లీలోని గౌరీ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్, హైదరాబాద్ ఐటీసీ కోహినూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన భేటీలో పాలసీపై అన్ని అంశాలు చర్చించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ స్కాంలో బుచ్చిబాబు సౌత్ గ్రూప్ కు ప్రతినిధిగా వ్యవహరించినట్లు ఆరోపించింది. లిక్కర్ పాలసీతో సంబంధం ఉన్న మొత్తం 51 మంది ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్లను తేదీలతో సహా ప్రస్తావించింది. ఇందులో నిందితుల పాత్ర, వారి తరపు తెరవెనక వ్యవహారం నడిపించిన వారి డీటైల్స్ ను ప్రత్యేకంగా పేర్కొంది. 

సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్​కు 100 కోట్లు

అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేత విజయ్ నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.100 కోట్లు చేరాయని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి ఉన్నట్లు మరోసారి ప్రస్తావించింది. ఎంపీ శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారని, ఈ సందర్భంగా సీఎం లిక్కర్ బిజినెస్ లోకి సౌత్ గ్రూప్ కు వెల్ కమ్ చెప్పినట్లు ఆరోపించింది. సౌత్ గ్రూప్ నుంచి నాయర్ కు చేరవేసిన డబ్బులకు అభిషేక్ బోయినపల్లి, దినేశ్‌‌‌‌‌‌‌‌ అరోరాలు కోర్డినేటర్లుగా పని చేసినట్లు వివరించింది.

లిక్కర్ దందాతో ప్రాపర్టీలు కొన్నరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన లాభాలతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రాపర్టీలు కొన్నారని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఫీనిక్స్ శ్రీహరితో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఈ ప్రాపర్టీలు కొనుగోలు చేశారని తెలిపింది. లిక్కర్ స్కామ్‌‌‌‌‌‌‌‌ మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిళ్లై.. ట్రయల్ కోర్టు (సీబీఐ స్పెషల్ కోర్టు)లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై మంగళవారం స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్ విచారణ జరిపారు. ఈడీ తరపు సీనియర్ అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ.. కవిత పేరును ప్రస్తావించారు. లిక్కర్ పాలసీ ద్వారా భారీ స్కామ్‌‌‌‌‌‌‌‌ జరిగిందని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. కవిత బినామీగా, సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తిగా పిళ్లై లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్నారని ఆరోపించారు. ఈ వాదనలపై పిళ్లై తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని కోర్టును కోరారు. మధ్యలో జోక్యం చేసుకున్న జడ్జి నాగ్ పాల్.. రొటీన్ వాదనలు వినిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. విచారణను జూన్ 2 కు కేసు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

కవిత వైపు నుంచే 65 శాతం డీల్

లిక్కర్ స్కామ్‌‌‌‌‌‌‌‌లో కేవలం కవిత తరపు నుంచే 65%  డీల్ జరిగిందని ఈడీ చెప్పింది. స్కామ్‌‌‌‌‌‌‌‌లో ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రు ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ప్రస్తావించింది. కవిత తరఫున అరుణ్ పిళ్లై, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తరపున ప్రేమ్ ప్రాతినిథ్యం వహించినట్లు పేర్కొంది. అయితే ఈ 65% వాటాల గురించి అరుణ్ పిళ్లై తోనే సమీర్ మహేంద్రు చర్చిం చేవాడని ఈడీ చార్జ్ షీట్ లో స్పష్టం చేసిం ది. తొలి మీటింగ్ జూమ్ కాల్​లో జరిగిం దని, ఇందులో అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబులను విజయ్ నాయర్ ఆహ్వానించారని తెలిపింది. తదుపరి చర్చల్లో అరుణ్, సౌత్ గ్రూప్ వెనకాల అసలు ఇన్వెస్టర్లుగా కవిత, మాగుంట శ్రీనివాసులు, శరత్ చంద్రా రెడ్డి ఉన్నట్లు విజయ్ నాయర్ చెప్పారన్నారు. కవిత, మాగుంట ఇండో స్పిరిట్ (డిస్ట్రిబ్యూషన్ బిజినెస్) లో తమ ఆసక్తిని అనేకమార్లు చూపినట్లు ఈడీ వెల్లడించింది.