- రేపు టీజీఆర్జేసీ, కేజీబీవీ ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారుల సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఒకే మేనేజ్‌మెంట్ (స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్) కింద ఉన్న రెండు విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం.. ఒకే నోటిఫికేషన్ ఇచ్చి.. ఒకే రోజు, ఒకే సమయంలో రెండు వేర్వేరు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం గందరగోళంగా మారింది. ఈ నెల3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టీజీఆర్జేసీ సెట్, కేజీబీవీ ఎక్సలెన్స్ ఎంట్రెన్స్ టెస్టులను షెడ్యూల్ చేశారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఏదో ఒక అవకాశాన్ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యాశాఖ అధికారుల సమన్వయ లోపమే ఇందుకు కారణమని స్టూడెంట్స్పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేనికి అప్లై చేస్తే.. దాంట్లోనే సీటు
రాష్ట్రవ్యాప్తంగా 35 గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్ లో 3 వేల సీట్లు, 93 ఎక్సలెన్సీ కేజీబీవీల్లో 3,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఒకే నోటిఫికేషన్ ను టీజీఆర్జేసీ రిలీజ్ చేసి.. అప్లికేషన్లు తీసుకున్నది. మొత్తంగా వీటి కోసం 76,174 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. అయితే, చాలా మంది విద్యార్థులు మీ-సేవ, కంప్యూటర్ సెంటర్ల ద్వారా, సెల్ ఫోన్లలో దరఖాస్తు చేశారు. ఏ పరీక్ష రాసినా.. రెండింటికీ అవకాశం కల్పిస్తారని భావించి, చాలా మంది కేవలం ఒక్క పరీక్షకు అప్లై చేసుకున్నారు.
ముందుగా టీజీఆర్జేసీ సెట్ ఉండటంతో దానికి 61వేలకు పైగా, కేజీబీవీలకు 14వేలకు పైగా విద్యార్థులు అప్లై చేసుకున్నారు. ఇప్పుడు టీజీఆర్జేసీకి అప్లై చేసిన వారికి కేజీబీవీల్లో అవకాశం ఉండబోదని అధికారులు చెప్తున్నారు. దీనికి అనుగుణంగానే హాల్ టికెట్లు వచ్చాక చూస్తే.. ఏ పరీక్షకు అప్లై చేశారో, ఆ ఒక్క దానికే హాల్ టికెట్ వచ్చింది. అధికారులు ఇప్పుడు ఏ పరీక్ష రాస్తే ఆ సంస్థలోనే మెరిట్ చూస్తాం.. అప్లై చేయని సంస్థలో సీటు ఇవ్వబోమని చెబుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వేర్వేరు హాల్ టికెట్లతో తిప్పలు..
రెండింటికీ అప్లై చేసుకున్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి రెండు హాల్ టికెట్లు వచ్చాయి. కానీ, పరీక్షలు ఒకే సమయం కావడంతో ఏ సెంటర్‌కు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రెండు స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని విద్యాసంస్థలే అయినప్పుడు, ఒకే ప్రవేశ పరీక్ష ఎందుకు పెట్టకూడదని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. అధికారుల సమన్వయ లోపంతో తమ పిల్లలు ఒక మంచి విద్యాసంస్థలో చేరే అవకాశాన్ని కోల్పోతున్నారని వారు వాపోతున్నారు.
విద్యాశాఖ అధికారులు కనీస అవగాహన కల్పించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల మెరిట్ ఆధారంగా నచ్చిన కాలేజీలో చేరే అవకాశం కల్పించాలనీ,. కానీ అధికారులు చేసిన తప్పుకు విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక పరీక్షకు హాజరైనా.. ఆ మార్కుల ఆధారంగానే రెండింటిలోనూ (గురుకులాలు, కేజీబీవీలు) అడ్మిషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
