యూనివర్సిటీల్లో ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లు ఎన్ని ఉన్నయ్?

యూనివర్సిటీల్లో ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లు ఎన్ని ఉన్నయ్?
  • వర్సిటీ రిజిస్ట్రార్లకు విద్యాశాఖ లేఖ  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల ఆర్థిక పరిస్థితిలపై  విద్యాశాఖ దృష్టి సారించింది. యూనివర్సిటీల ఖాతాల్లో ఉన్న ‘ఫిక్స్‌‌డ్ డిపాజిట్ల’ వివరాలు చెప్పాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఇటీవలె అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా లేఖ రాశారు. వెంటనే ఎఫ్‌‌డీల వివరాలు పంపాలని ఆదేశించారు. దీంతో వర్సిటీ వర్గాల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్న వర్సిటీల నుంచి.. ఉన్న కాస్తో కూస్తో నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా లేక ఎఫ్‌‌డీలు ఉన్నాయనే సాకుతో బ్లాక్ గ్రాంట్లు ఆపేస్తుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వడ్డీ నుంచే జీతాలు, అభివృద్ధి పనులు

విద్యార్థుల ఫీజులు, పరీక్షల ఫీజులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వర్సిటీలు ఫిక్స్‌‌‌‌‌డ్ డిపాజిట్లుగా మలుచుకుంటాయి. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, అత్యవసర సమయాల్లో జీతాలు, చిన్నచిన్న అభివృద్ధి పనులకు ఈ వడ్డీ నుంచే ఖర్చు చేస్తుంటాయి. అయితే, హఠాత్తుగా ఇప్పుడు విద్యాశాఖ ఈ ఎఫ్‌‌డీల వివరాలు అడగడం చర్చనీయాంశమైంది. ఒక్కో వర్సిటీలో ఎన్ని కోట్ల డిపాజిట్లు ఉన్నాయి..అవి ఏ బ్యాంకుల్లో ఉన్నాయి..వాటి కాలపరిమితి ఎంత? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. దీనిద్వారా నిధులకు కొత పెట్టొద్దని వర్సిటీ వర్గాలు కోరుతున్నాయి.