V6 News

మ‌‌హిళా సంఘాల స‌‌భ్యులకు త్వరలో ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ : మంత్రి సీత‌‌క్క

మ‌‌హిళా సంఘాల స‌‌భ్యులకు త్వరలో ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ : మంత్రి సీత‌‌క్క
  •     అక్షరజ్ఞానంతోపాటు ఉన్నత చదువులు 
  •     బాలికల కోసం ‘స్నేహా’ సమ్మర్ ప్రోగ్రామ్ 
  •     సైక్లింగ్, లైఫ్ స్కిల్స్‌‌లో శిక్షణ
  •     సెర్ఫ్​ ఆఫీసర్లతో మంత్రి సీతక్క సమీక్ష 

హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాల సభ్యులెవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని, అక్షర‌‌జ్ఞానంతోపాటు వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని మంత్రి సీత‌‌క్క తెలిపారు. త్వరలోనే మ‌‌హిళా సభ్యుల ఎడ్యుకేష‌‌న్ ప్రొఫైల్స్‌‌ను రెడీ చేయాల‌‌ని ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం బీఆర్కే  భవన్‌‌లో సెర్ఫ్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 6 లక్షల మందికి అక్షరజ్ఞానం అందించామని, త్వరలో మరో 6 లక్షల మందికి విద్యాబోధన అందిస్తామని తెలిపారు. 

చదువు మధ్యలో ఆపేసినవారికి మరింత చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రుణాల రికవరీలో వంద శాతం ఫలితాలు సాధించిన నిర్మల్ జిల్లా సమాఖ్యను మంత్రి అభినందించారు. గంగవ్వను స్ఫూర్తిగా తీసుకుని అన్ని జిల్లాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త సభ్యుల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రతి మహిళ సంఘ సభ్యురాలిగా మారేలా కృషి చేయాలని సూచించారు. 

మహిళలు రాజకీయాల్లో రాణించాలి

రాష్ట్రవ్యాప్తంగా 8,227 గ్రామ మహిళా సంఘ భవనాలకు అనుమతులు ఇచ్చామని, అందులో 5,239 భవనాల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాది మరో 5 వేల భవనాలు నిర్మిస్తామని చెప్పారు. టీనేజ్ బాలికల కోసం వేసవి సెలవుల్లో ‘స్నేహా’ సమ్మర్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఇందులో లైఫ్ స్కిల్స్, ఆరోగ్యం, భద్రతతో పాటు బాలికలు సొంతంగా ఎదిగేందుకు బైక్ రైడింగ్, సైకిల్ తొక్కడం వంటి నైపుణ్యాలను నేర్పిస్తామని వెల్లడించారు. 

త్వరలో మహిళా రిజర్వేషన్లు రానున్న నేపథ్యంలో మహిళలు కేవలం గృహిణులుగా కాకుండా రాజకీయాల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో మహిళా సంఘాలు గ్రామాల్లో కీలక పాత్ర పోషించాలని కోరారు.