నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారింది

నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారింది

విద్యార్థి వికాసానికి పాఠశాల విద్య పునాది వంటిది. అన్ని సౌలత్​లు, మంచి వాతావరణం, ఉత్తమ బోధకులు ఉన్న బడుల్లో విద్యా కుసుమాలు వికసిస్తాయి. మన దేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది. 15 లక్షల బడుల్లో 25 కోట్లకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నిధుల లేమి, టీచర్ల కొరత, మౌలిక వసతులు లేక నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారింది. పాఠశాల విద్యపై ప్రభుత్వాల పట్టింపు లేనితనంతో రాను రాను విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పనితీరు గ్రేడింగ్ సూచికల నివేదిక తేటతెల్లం చేస్తున్నది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు బాగా పడిపోయాయి. సర్కారు బడుల్లో విద్యార్థులు నమోదు అంతకంతకూ తగ్గుతున్నది. జాతి భవిత తరగతి గదిలో రూపు దిద్దుకుంటుంది కాబట్టి నాణ్యమైన విద్య అందరికీ అందినప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై అధికంగా నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. 

పీజీఐ సూచికలో మన స్థానం..
కేంద్ర విద్యాశాఖ ఏటా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో పాఠశాల విద్య స్థితిగతులు, పనితీరు గ్రేడింగ్ సూచికల(పీజీఐ) పేరుతో నివేదిక విడుదల చేస్తుంది. షాగున్, మధ్యాహ్న భోజన పథకం, యూడైస్, జాతీయ సాధన సర్వే, జాతీయ విద్య పరిశోధన శిక్షణా సంస్థ(ఎన్​సీఈఆర్​టీ) గణాంకాల ఆధారంగా పీజీఐ నివేదిక విడుదల చేస్తుంది. అభ్యసనా ఫలితాల నాణ్యత, విద్యార్థులు, మౌలిక వసతులు, సమానత్వం, పరిపాలన విధానం అనే ఆరు అంశాల ఆధారంగా పది దశల్లో 70 సూచికల్లో1000 పాయింట్ల ఆధారంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాల విద్యా స్థితిగతులను విడుదల చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన 2019–-20 పీజీఐ నివేదికలో తెలుగు రాష్ట్రాలు అట్టడుగు స్థానంలో నిలిచాయి. పీజీఐ మొదటి లెవెల్ లో ఏ రాష్ట్రం కూడా స్థానం పొందలేకపోగా.. సెకండ్​లెవెల్​లో అండమాన్ నికోబార్ దీవులు, చత్తీస్ గఢ్, పంజాబ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. పనితీరు గ్రేడింగ్ నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ స్థానం దక్కించుకోగా, తెలంగాణ ఐదో లెవెల్ పొందింది. కేంద్ర విద్యా శాఖ నిర్ణయించిన అంశాల పరంగా చూస్తే అభ్యసనా ఫలితాల నాణ్యత సూచికలో ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ12వ స్థానంలో నిలిచాయి. విద్యార్థుల- ప్రవేశాలు.. నిలుపుదల విషయంలో ఏపీ 23 స్థానం పొందగా, తెలంగాణ18వ స్థానంలో ఉంది. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ 21వ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్18వ స్థానంలో నిలిచి మనకంటే కొంత మెరుగైన పనితీరు కనబరిచింది. సమానత్వం సూచికలో ఆంధ్రప్రదేశ్ 35, తెలంగాణ 26వ స్థానాల్లో నిలిచాయి. పరిపాలన విధానం పరంగా ఏపీ18, తెలంగాణ26వ స్థానం పొందాయి. జిల్లాల పరంగా ఫలితాలు విశ్లేషిస్తే తెలంగాణలో ఖమ్మం, హనుమకొండ, సంగారెడ్డి జిల్లాలు పనితీరు గ్రేడింగ్ సూచికలో మంచి మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాయి. మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు అట్టడుగున ఉన్నాయి. 

బడుల్లో సౌలతుల్లేక..
14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ ఉచిత విద్య, సుశిక్షితులైన టీచర్లు, పౌష్టికాహారం, ఉచిత దుస్తులు, పుస్తకాలు అందిస్తున్న ప్రభుత్వ బడులను కాదని, సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్న, అధికంగా ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు ఎందుకు పెరుగుతున్నాయి? అనే దానిపై ప్రభుత్వాలు ఆత్మవిమర్శ  చేసుకోవాలి. ఇటీవల విడుదలైన జాతీయ సాధన సర్వే ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు కనీస అభ్యసనా సామర్థ్యాలు సాధించడం లేదని తేల్చింది. 3, 5,8,10 తరగతుల విద్యార్థుల అభ్యసనా ఫలితాలు విశ్లేషిస్తే చాలా దారుణ స్థితిలోకి పడిపోయినట్లు బయటపడింది. అలాగే ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ పొందుతున్న విద్యార్థుల డ్రాపౌట్ రేటు క్రమంగా తగ్గుతున్నది. బడి బయట పిల్లలు, బాల కార్మికులు బడికి వెళ్లేందుకు ‘ఆపరేషన్ స్మైల్’, ‘ఆపరేషన్ ముస్కాన్’ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఆశించిన రీతిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని మెజార్టీ సర్కారు బడుల్లో తరగతి గదుల కొరత ఉంది. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలు, క్రీడ మైదానాలు, ప్రయోగశాలలు, లైబ్రరీలు, తాగునీటి సరఫరా లేదు. ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నా.. సమయానికి ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించక విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. ప్రత్యేక అవసరాల పిల్లలకు సరైన వసతులు లేవు. 
ప్రమాణాలు పెంచాలి.

దేశమైనా, రాష్ట్రమైనా ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే నైపుణ్యం గల మానవ వనరులు కావాలి. అది విద్యతోనే ముడిపడి ఉంటుంది. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్యను బట్టే రేపు భవిష్యత్​లో మానవ వనరుల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుత్వం బడులను డెవలప్​చేయడంతోపాటు, విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలి. టీచర్లు కూడా ఏకోన్ముఖ లక్ష్యంతో, జవాబుదారితనంతో పని చేయాలి. బోధనలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా తగిన వృత్యంతర శిక్షణ ఉండాలి. ఆ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేయాలి. ప్రాథమిక తరగతులకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. ఉన్నత తరగతులకు సబ్జెక్టుకు కనీసం ఇద్దరు టీచర్లను నియమిస్తే విద్యా ప్రమాణాలు వికసిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయిస్తూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలి. నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ కోసం విద్యాధికారులను ఎప్పటికప్పుడు నియమించాలి. దేశ భవిష్యత్తును నిర్దేశించే పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు, విద్యా ప్రమాణాల పతనం ఫలితాలు రేపటి సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. 

మన ఊరు మన బడి..
రాష్ట్రంలో ‘మన ఊరు – మన బడి’ పథకం కింద మూడు దశల్లో రూ.7,290 కోట్లు ఖర్చు చేసి బడుల్లో అన్ని సౌలత్​లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఎంపిక చేసిన బడుల్లోనే ఇంకా చాలా చోట్ల నిధులు లేక పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దాదాపు16 వేల నుంచి 20 వేల టీచర్​పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా బడుల్లో ఖాళీ టీచర్ల విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వం విద్యా వలంటీర్లను కూడా నియమించడం లేదు. మరోవైపు టెట్​ముగిసినా.. ఇప్పటికే ప్రతిపాదించిన ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ఇవ్వడం లేదు. మెజార్టీ మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులుగా ఇన్​చార్జీలు కొనసాగుతున్నారు. పాఠశాల అభివృద్ధి, నిర్వహణ కోసం ఇస్తున్న నిధులు కరెంట్ బిల్లులకు కూడా సరిపోవడం లేదు. ఇన్ని సమస్యలతో విద్యలో నాణ్యతా ప్రమాణాలు సాధించడం ఎలా సాధ్యమవుతుంది? 
- అంకం నరేశ్, తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్, యూఎఫ్​ఆర్టీఐ