విద్యా వలంటీర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవ్​

విద్యా వలంటీర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవ్​
  • కష్టాలు పడుతున్నవిద్యా వలంటీర్లు
  • గతేడాది డబ్బులునేటికీ అందని వైనం
  • స్కూల్స్ ప్రారంభమై రెండునెలలైనా జీతాల ఊసే లేదు
  • ప్రయాణ ఖర్చులు, ఇంటి అద్దెచెల్లిం పులకూ చేయిచాచుడే..

హైదరాబాద్‍, వెలుగు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పాటు పడుతున్న విద్యా వలంటీర్లకు నెల నెలా జీతాలు చెల్లించడంలో ప్రభుత్వ విద్యా విభాగం తరచూ విఫలమవుతోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని, ఫైలు పే అండ్‌ అకౌంట్స్‌కు పంపించామని విద్యాశాఖాధికారులు సమాధానాలు చెబుతూ మభ్యపెడుతున్నారు. గత అకాడమిక్‍ ఇయర్‍లో చదువులు చెప్పినందుకు చెల్లించాల్సిన జీతాలు కొత్త ఏడాది ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా జీతాల ఊసే లేదు.  అసలే తక్కువ జీతాలకు పనిచేస్తున్నా అవి కూడా సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఆర్థిక సమస్యలతో చదువులు చెబుతున్నట్లు పలువురు విద్యా వలంటీర్లు వాపోతున్నారు. విద్యా వలంటీర్లంటేనే అధికారులు లైట్‍ తీసుకుంటున్నారని, అధికారులకు ఒక నెల జీతాలు చెల్లించకపోతే మేము పడే బాధలు/ఇబ్బందులు వారికి అర్థమవుతాయని  పేర్కొనడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.  ప్రతి నెల సకాలంలోనే హాజరు నమోదును విద్యాశాఖాధికారులకు అందజేస్తున్నా ప్రతి నెల జీతాలను సకాలంలో అందేలా మాత్రం అధికారులు చొరవ తీసుకోవడం లేదని కొందరు హెడ్‍మాస్టర్లు తెలిపారు. ఎంఈవోలు, డీఈవోలు జీతాలు అందేలా చూడటంలో చొరవ తీసుకోవడం లేదు. అది తమ బాధ్యత కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ఇచ్చేదే తక్కువ.. అదీ కూడా అందదు

గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‍ నెలలకు సంబంధించిన జీతాలు ఇప్పటికీ వలంటీర్లకు అందలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చేప్పేందుకు ఎంపిక చేసిన విద్యా వలంటీర్లకు నెలకు రూ.12 వేలు చెల్లించేందుకు గతేడాది  ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కూడా అవే జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జీతాలు పెంచాలని విద్యా వలంటీర్లు డిమాండ్‍ చేస్తున్నారు. అసలే తక్కువ జీతాలు ఆపై చెల్లించడంలో జాప్యం కారణంగా చాలా మంది విద్యా వలంటీర్లు ప్రైవేట్‍ స్కూల్స్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. నగరంలోని పలు ప్రైమరీ స్కూల్స్ లో విద్యా వలంటీర్లే నడుపుతున్నారు. చాలా హై స్కూల్స్ లో సబ్జెక్టు టీచర్ల కొరతను విద్యా వలంటీర్లు భర్తీ చేస్తున్నారు.

670 మందే మిగిలారు

జిల్లాలో 686 ప్రభుత్వ ప్రైమరీ, హై స్కూల్స్ పరిధిలో సుమారు 92 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని విద్యాశాఖాధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు అవసరమైన సంఖ్యలో టీచర్లు లేనందున విద్యార్థులకు తాత్కాలికంగా పాఠాలు చెప్పేందుకు విద్యావలంటీర్లను నియమించారు. 2018–19 అకాడమిక్‍ ఇయర్‍లో 1000 మంది విద్యా వలంటీర్లు అవసరం కాగా 801 మందిని మాత్రమే నియమించారు. వారినే ఈ ఏడాది కొనసాగడానికి అనుమతిచ్చారు. కొందరు చేరేందుకు ఆసక్తి చూపకపోవడం, మరికొందరికి టీఆర్టీలో ఉద్యోగాలు రావడంతో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 670 మంది మాత్రమే విద్యావలంటీర్లు పనిచేస్తున్నారు.

స్పందన కరువు

ఫ్రిబ్రవరి, మార్చి, జూన్‍, జులై నెల జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. జీతాల విషయమై డీఈవో దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్పందన రాలేదు.  ప్రతి సంవత్సరం జీతాల సమస్య ఉంది. స్కూల్‍ వెళ్లేందుకు ప్రయాణ ఛార్జీలకు సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

హెచ్‍.శ్రీనివాస్, విద్యావలంటీర్