సీఏఏపై నిరసనలకు కుట్ర.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆగ్రహం

సీఏఏపై నిరసనలకు కుట్ర.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆగ్రహం

నాగ్‌‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్‌‌లో నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక దసరా ఉత్సవాల్లో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన పలు కీలక అంశాల గురించి భగవత్ మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర వివాదం, సీఏఏ నిరసనల గురించి ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాలని కొందరు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘గతేడాది ఆర్టికల్ 370 రద్దయ్యింది. ఆ తర్వాత నవంబర్ 9న సుప్రీం కోర్టు అయోధ్యపై తీర్పును వెల్లడించింది. మొత్తం దేశం ఆ తీర్పును స్వాగతించింది. ఈ ఏడాది ఆగస్టు 5న రామ మందిర పునర్నిర్మాణంలో భాగంగా భూమి పూజ వేడుక జరిగింది. ఈ అన్ని వేడుకల సందర్భాల్లోనూ భారతీయుల సహనం, సున్నితత్వానికి మనం సాక్ష్యాలుగా నిలిచాం. దేశంలో సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలకు కూడా మనం సాక్ష్యాలుగా ఉన్నాం. సీఏఏ గురించి సమగ్రంగా చర్చించడానికి ముందే అందరి దృష్టి కరోనా వైపు మళ్లింది. ప్రత్యేకించి ఏ ఒక్క మతాన్నో సీఏఏ వ్యతిరేకించడం లేదు. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకించిన కొందరు మాత్రం ముస్లిం సోదరులను తప్పుడు భావనలతో ప్రేరేపించారు. ముస్లింల జనాభాను నియంత్రించేందుకే ఈ చట్టం ఉద్దేశించబడినదని వారిని తప్పుదోవ పట్టించారు. కొందరు అవకాశవాదులు సీఏఏ నిరసనల పేరుతో శాంతికి భంగం కలిగించారు. కరోనా రావడంతో సీఏఏ నుంచి అందరి ద‌ృష్టి మహమ్మారి వైపు మళ్లింది. కానీ ఇప్పటికీ కొన్ని అల్లర్ల మూకలు, అవకాశవాదులు సీఏఏపై నిరసనలు కొనసాగాలని ప్రయత్నిస్తున్నారు’ అని భగవత్ పేర్కొన్నారు.