భారత్లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదుల అరెస్ట్

భారత్లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదుల అరెస్ట్

న్యూఢిల్లీ: భారత్లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ఎనిమిది మంది అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఆరుగురిని, పశ్చిమ బెంగాల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. పాకిస్తాన్ ఐఎస్ఐ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల మద్దతుతో భారతదేశంలో ఒక పెద్ద ఉగ్ర వాద కుట్రకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఈ ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని దుస్తులు తయారుచేసే గార్మెంట్ యూనిట్లో ఉన్న మిజానూర్ రెహమాన్, మొహమ్మద్ షబాత్, ఉమర్, మొహమ్మద్ లిటాన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్జల్ అనే ఆరుగురు అనుమానితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనుమానితులలో బంగ్లాదేశ్ దేశస్తుడు కూడా ఉన్నాడు. నిందితులు గుర్తింపు కోసం నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగిస్తున్నారని విచారణలో వెల్లడైంది. అనుమానితుల నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.  దర్యాప్తు కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మళ్లీ టెర్రర్ అటాక్​కు ముష్కరులు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. పాత ఢిల్లీలో చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆలయం, ఎర్రకోట పరిసరాలతోపాటు దేశవ్యాప్తంగా ఇతర రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాలపై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 

►ALSO READ | చొరబాటుదారులను ఓటర్ లిస్ట్ నుంచే కాదు.. దేశం నుంచీ తొలగిస్తం: కేంద్రమంత్రి అమిత్‌‌‌‌ షా

ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాన ఆలయాలు, మార్కెట్లు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. చాందినీ చౌక్, ఎర్రకోట ప్రాంతాల్లో సీసీటీవీ నిఘాను పెంచారు. ముఖ్యమైన ఆలయాల వద్ద మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్‌‌‌‌లతో తనిఖీలు చేస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్, బాంబు స్క్వాడ్​లను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతానికి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలేనని అధికారులు తెలియజేశారు.

కాగా, ఈ నెల 6న పాకిస్తాన్​లోని ఇస్లామాబాద్​లో షియా వర్గానికి చెందిన మసీదు వద్ద బాంబు దాడి జరిగి 31 మంది చనిపోగా..160 మంది గాయపడ్డారు. తామే ఈ దాడి జరిపామని ది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. ఈ దాడికి ప్రతీకారంగా ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని పలు కీలక ప్రార్థనా మందిరాల వద్ద హఫీజ్ సయీద్   ఆధ్వర్యంలో టెర్రర్ అటాక్​కు లష్కరే తయిబా ప్లాన్ చేసిందని నిఘా వర్గాలు తెలిపాయి. 

ఈ హెచ్చరికల మధ్యే, పంజాబ్‌‌‌‌లోని అమృత్‌‌‌‌సర్, కాశ్మీర్‌‌‌‌లోని గాందర్బల్(సఫాపోరా)లో భద్రతా బలగాలు ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేయడం ఆందోళనకరంగా మారింది. కాగా, నిరుడు నవంబరు10న ఎర్రకోట వద్ద జైషే మహమ్మద్, అన్సార్ గజ్వాతుల్ హింద్ ఆధ్వర్యంలో వైట్ కాలర్ టెర్రరిస్టులు కారు బాంబు దాడి చేయడంతో12 మంది ప్రాణాలు కోల్పోయారు. 20కిపైగా మంది గాయపడ్డారు.