ఎన్నికల కోడ్ తో జర పైలం... హైదరాబాద్ లో రూ. 50 వేలు దాటితే సీజ్

ఎన్నికల కోడ్ తో జర పైలం... హైదరాబాద్ లో రూ. 50 వేలు దాటితే సీజ్

 తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. స్థానిక ఎన్నికలతో జిల్లాల్లో.. జూబ్లీహిల్స్ బైపోల్ తో హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సంక్షేమ, అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు.  సరైన పత్రాలు లేకుండా రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తరలిస్తే సీజ్ చేస్తున్నారు పోలీసులు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఐదు విడుతల్లో జరగనున్నాయి. రెండు విడుతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.  నవంబర్ 11 న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అప్పటి వరకు  ప్రభుత్వం లేదా పాలక పక్షానికి చెందిన నాయకులు కొత్త పథకాలను ప్రకటించడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టడానికి వీలు లేదు. జిల్లా కలెక్టర్లు, స్థానిక ఎన్నికల అధికారులు కోడ్ అమలును పర్యవేక్షిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో కోడ్ కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇది వర్తించదు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం యథావిధిగా పాలనా వ్యవహారాలు కొనసాగించుకోవచ్చు.

జూబ్లీహిల్స్ బై పోల్ నవంబర్ 11న జరగనుంది.  14న కౌంటింగ్ జరగనుంది. దీంతో హైదరాబాద్ లో నవంబర్ 14 వరకు  ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. వాహనాలు ఆపి చెక్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ లేకుండా రూ. 50 వేలకు మించి పట్టుబడితే సీజ్ చేస్తున్నారు.