
- సీఈవో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ
హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గుర్తింపు నిచ్చింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో), రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ లేఖ రాసింది. పార్టీకి గుర్తింపు రావడం పట్ల పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ నేతలతో కలిసి లోటస్‌పాండ్‌లో కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీకి గుర్తింపు రాకుండా కొంతమంది అడ్డుపడ్డారని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా పార్టీ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోగలిగామని ఆయన అన్నారు. పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా జిల్లాలు, మండలాలకు కొత్త కార్యవర్గాన్ని షర్మిల ప్రకటిస్తారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల కొన్నాళ్లపాటు నిలిచిపోయిన షర్మిల పాదయాత్ర.. మరో పదిరోజుల్లో తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించారు. అధికార పార్టీ చర్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ పిచ్చి ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.