
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యాన్ని కల్పించబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం. తొలిసారిగా 80 ఏళ్ళు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనుంది. ఇందుకోసం ఫామ్ 12డీ ఏర్పాటు చేస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎవరైతే 80 ఏండ్లు..ఆపై ఉన్న వృద్ధులు ఫామ్ 12Dను పూర్తి చేసి..ఆ ఫాంను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుందన్నారు. ఇందులో ఓటరు పూర్తి వివరాలు, ఆయనకు గల సమస్యను వెల్లడించాలని చెప్పారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వారు పోలింగ్ బూత్ లోకి వచ్చి ఓట్లేయడానికి వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు ఓటర్ల ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ఏదైనా ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయని తెలిపారు.
తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల ఓటర్లు ఉండగా.. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557, వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 ఉన్నారని రాజీవ్ కుమార్ చెప్పారు. తెలంగాణ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించామని తెలిపారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామని అనడం సరికాదన్నారు. రాష్ట్రంలో 2022-23లో 22 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. ఫామ్ అందిన తర్వాతనే ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించామని వెల్లడించారు. తెలంగాణలో కొత్తగా 8.11 లక్షల యువ ఓటర్ల నమోదు చేసుకున్నారని తెలిపారు. జూలై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల మంది యువతకు ఓటు హక్కు కల్పించామని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల కోసం తెలంగాణలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఒక్కో పోలీసు స్టేషన్‌లో సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు.