- ‘వన్ వోటర్ లిస్ట్’ అమలుపై రాష్ట్రాల కమిషనర్లతో చర్చ
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) 27 ఏండ్ల తర్వాత అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లతో సమావేశం కానుంది. మంగళవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధ్యక్షతన జాతీయ రౌండ్ టేబుల్ సమావేశంజరగనుంది.
ఈ సమావేశంలో ఎన్నికల సమగ్రత, సామర్థ్యం పెంపుపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకే ఏకీకృత ఓటర్ జాబితా (కామన్ ఎలక్టోరల్ రోల్/ వన్ వోటర్లిస్ట్) అమలు చేయడంపై చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్లు.. స్థానిక ఎన్నికలకు, భారత ఎన్నికల సంఘం.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు వేర్వేరు ఓటర్ జాబితాలను నిర్వహిస్తున్నాయి.
అయితే, ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాబితాలో 12.7 కోట్ల ఓటర్లు ఉండగా.. ఈసీఐ స్పెషల్ఇంటెన్సివ్రివిజన్(సర్) డ్రాఫ్ట్ రోల్‌లో 12.5 కోట్ల ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇలాంటి వ్యత్యాసాలను తొలగించి, ఒకే కచ్చితమైన, ఏకరూప జాబితా ద్వారా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, నమ్మదగినదిగా మార్చాలనేది భారత ఎన్నికల సంఘం ప్రణాళిక. ఈ "వన్ వోటర్ లిస్ట్" అమలు అయితే ఓటర్లు ఒకే చోట నమోదు అవుతారు.
