V6 News

కాంగ్రెస్​లో సీనియర్ల అలక..  పార్టీ హైకమాండ్ వద్దే తేల్చుకునేందుకు సిద్ధం

కాంగ్రెస్​లో సీనియర్ల అలక..  పార్టీ హైకమాండ్ వద్దే తేల్చుకునేందుకు సిద్ధం
  • పొన్నం, చిన్నారెడ్డి, కొండా సురేఖ, కుసుమ కుమార్​కు ఎన్నికల కమిటీలో చోటు దక్కలే
  •  బయటి నుంచి వచ్చినోళ్లకే పదవులిస్తున్నరని అసంతృప్తి
  • రాహుల్, సోనియా, ఖర్గేలను కలవాలని యోచన
  • అగ్రవర్ణాలకు సగం స్థానాలిచ్చి..  బీసీలకు ఐదే ఇవ్వడంపై కేడర్ ​ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: మూడ్రోజుల కింద ప్రకటించిన ఎన్నికల కమిటీ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని రాజేసింది. సీనియర్​ నేతలు పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, జెట్టి కుసుమ కుమార్, కొండా సురేఖ, ఈరవర్తి అనిల్​కు ఎన్నికల కమిటీలో చోటు కల్పించలేదు. దీంతో పార్టీ కోసం ఎంత శ్రమించినా గుర్తింపు లేకుండా పోతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న తమను కాదని పారాచూట్ లీడర్లకు పదవులిస్తున్నారని అంటున్నారు. దీనిపై హైకమాండ్​కు ఫిర్యాదు చేయాలని ఆయా నేతలు నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. కమిటీ నియామకాల్లో సామాజిక న్యాయం పాటించలేదని మండిపడుతున్నారు. బీసీలకు ఐదే ఇచ్చి.. అగ్రవర్ణాలకు దాదాపు సగం స్థానాలు కట్టబెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ నేతలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లోలోపల రగులుతున్నరు

పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, కుసుమ కుమార్​ ఎన్ఎస్​యూఐ నుంచి వివిధ హోదాల్లో పనిచేసి కాంగ్రెస్​ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. చిన్నారెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. హైకమాండ్​వద్ద మంచి పేరుంది. పొన్నం, కుసుమ కుమార్​ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. అలాంటి తమను కాదని వేరే పార్టీల నుంచి జంప్​ కొట్టిన వాళ్లకు ఉన్నత పదవులు ఇస్తున్నారని సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిపై ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర నాయకత్వంతో వారు చర్చలు జరపనప్పటికీ.. లోలోపల రగిలిపోతున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై హైకమాండ్​కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్ గాంధీ ముందే ఈ విషయంపై అటో ఇటో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. ప్రస్తుతం రాహుల్ మోకాలి శస్త్రచికిత్స కోసం కేరళలో ఉన్నారని, ఆయన కోలుకున్నాక వచ్చే నెల మొదటి వారంలో ఆయన్ను కలవాలని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్​తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీని వాళ్లు కలవనున్నట్టు తెలుస్తున్నది.

రెడ్లకు తొమ్మిది.. బీసీలకు ఐదు..

కమిటీలో ఇద్దరు గౌడ్​లకు చోటు కల్పించినందున.. ఆ సామాజిక వర్గానికి చెందిన మరొకరికి చోటు కల్పించలేదన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఆ వాదనను పొన్నం వర్గం నేతలు కొట్టిపారేస్తున్నారు. సామాజిక సమీకరణాల ప్రకారమే అయితే.. 26 మంది సభ్యులున్న కమిటీలో దాదాపు 35% స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వలేదా అని ప్రశ్నిస్తున్నారు. కమిటీకి చైర్మన్​గా ఉన్న పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి సహా 9 మందికి చోటిచ్చారు. కమిటీలో సగం మందిదాక పెద్ద కులాల నేతలకే చోటు కల్పించి.. కేవలం ఐదుగురు బీసీలకే చోటిచ్చారన్న వాదనలూ తెరపైకి వస్తున్నాయి. పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న పొన్నం ప్రభాకర్.. మరో రెండు మూడ్రోజుల్లో తన అనుచరులతో సమావేశమై, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే ఆయన అనుచరులు కొందరు పొన్నంతో భేటీ అయ్యారు. పొన్నంకు జరిగిన అన్యాయంపై ఆయన అనుచరులు నేరుగా రేవంత్​తోనే తేల్చుకోవాలని చూస్తున్నారు.  ఆదివారం గాంధీ భవన్​లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఉన్నందున.. గాంధీభవన్​కు వచ్చి రేవంత్​తో ఈ విషయంపై చర్చించనున్నట్టు తెలుస్తున్నది.

పారాచూట్ నేతలకేనా..

ఈ నెల 2న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అలా చేరారో లేదో.. పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్​గా పదవిని ఇచ్చారు. దాంతో పాటు ఎన్నికల కమిటీలోనూ ఆయనకు చోటు కల్పించారు. కమిటీలో చోటు దక్కించుకున్న నేతల్లో ఆయనొక్కరే వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన నేత. ఈ క్రమంలోనే ఆయనకు పదవులిచ్చి.. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నేతలను పక్కనపెట్టడం పార్టీ వర్గాల్లో కలవరం రేపుతున్నది. కమిటీలో చోటు దక్కని నేతలు.. ఉదయ్​పూర్ డిక్లరేషన్​ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ డిక్లరేషన్ ప్రకారం కొత్తగా చేరిన నేతలకు పార్టీలో ఎలాంటి ఉన్నత పదవులు ఇవ్వరాదని రాహుల్ సహా జాతీయ స్థాయి నేతలంతా తీర్మానం చేశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. కొండా సురేఖకూ కమిటీలో చోటు దక్కకపోవడంపైనా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.

కమిటీలో కోత

కమిటీలోనూ పార్టీ రాష్ట్ర నాయకత్వం కోతలు విధించింది. 2018 ఎన్నికలప్పుడు 46 మందితో కమిటీని ఏర్పాటు చేయగా.. ఇప్పుడు దానిని 26 మందికి కుదించింది. ఎక్స్అఫీషియో సభ్యులను కలుపుకుంటే 29 మంది కమిటీలో ఉన్నారు. కమిటీని ఎందుకు కుదించాల్సి వచ్చిందన్న ప్రశ్నలూ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కమిటీని రివైజ్ చేసి మరికొందరు సభ్యులకు అవకాశం కల్పిస్తే.. అందులో ఈ అసంతృప్త నేతలకు చోటు దక్కుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తొలుత చోటు కల్పించకుండా ఆ తర్వాత కల్పిస్తే లాభమేందన్న వాదనను ఆయా నేతలు వ్యక్తం చేస్తున్నట్టు టాక్.