ఎలక్షన్​ ఆఫీసర్​ బీఆర్ఎస్​ క్యాండిడేట్​కు అనుకూలంగా వ్యవహరించిండు : కాట శ్రీనివాస్ గౌడ్​

ఎలక్షన్​ ఆఫీసర్​ బీఆర్ఎస్​ క్యాండిడేట్​కు అనుకూలంగా వ్యవహరించిండు : కాట శ్రీనివాస్ గౌడ్​
  • రిటర్నింగ్ ఆఫీసర్​పై సీఈసీకి కంప్లయింట్​ చేస్తం
  • పటాన్​చెరు కాంగ్రెస్​ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్​

రామచంద్రాపురం, వెలుగు:  ఎలక్షన్​ కౌంటింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, తమ ఏజెంట్లను డైవర్ట్ చేసి ఫలితాలను గోల్​మాల్ చేసి అవకతవకలకు పాల్పడ్డారని పటాన్​ చెరు కాంగ్రెస్​ అభ్యర్థి కాట శ్రీనివాస్​ గౌడ్ ఆరోపించారు. రిటర్నింగ్ ఆఫీసర్​ ఏకపక్ష నిర్ణయంతో బీఆర్ఎస్​ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించాడని మండిపడ్డారు. సోమవారం రామచంద్రాపురంలో మాట్లాడుతూ ఎక్కడైనా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ముందుగా లేదా చివరలో లెక్కిస్తారని, కానీ పటాన్​చెరులో మాత్రం బ్యాలెట్ ఓట్లను మధ్యలో లెక్కించి తమ ఏజెంట్లను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. 12 నుంచి 18 రౌండ్లలోని ఈవీఎం మెషీన్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, కొన్ని సీల్ ​లేని ఈవీఎంలను మధ్యలో తీసుకొచ్చి బీఆర్ఎస్​ అభ్యర్థికి సపోర్ట్​గా ఫలితాలు వెల్లడించారన్నారు.

ఆ ఆరు రౌండ్ల ఫలితాలను ఇప్పటికీ అధికారులు ఆన్​లైన్​  పోర్టల్​లో అప్​లోడ్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. 70, 198 పోలింగ్​బూత్​ల ఈవీఎంలలో సమస్యలున్నాయని, వాటిని లెక్కించకుండానే పక్కన పెట్టారని, 12వ రౌండ్ నుంచి ఫలితాలను అధికారికంగా కూడా ప్రకటించలేదన్నారు. రీ కౌంటింగ్ చేయాలని పట్టుబట్టినా పట్టించుకోకుండా బీఆర్ఎస్​ అభ్యర్థి గెలుపొంందినట్టు  సర్టిఫికెట్ ఇచ్చారని, తమ సంతకాలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లకు..అభ్యర్థులకు పోలైన వాటికి మధ్య 1675 ఓట్ల తేడా ఉందని, దీనిపై సెంట్రల్​ఎలక్షన్​ కమిషన్​కు ఫిర్యాదు చేస్తామన్నారు.