4 రాష్ట్రాలు, యూటీలో.. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

4 రాష్ట్రాలు, యూటీలో.. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నాలుగు రాష్ట్రాలు (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం ) కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి  అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8:00 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించి, అనంతరం ఈవీఎం (EVM) ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదయం 10గంటల కల్లా స్పష్టమైన ట్రెండ్స్, సాయంత్రానికి తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు సాగుతోంది. కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఈసీ. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్ లో సీసీ కెమెరాలు, లెక్కింపు ప్రక్రియ లైవ్ రికార్డింగ్ జరుగుతుంది. 

బెంగాల్​లో మొత్తం 294 సీట్లకు గానూ 293 చోట్ల కౌంటింగ్ జరుగుతోంది. ఫాల్తా నియోజకవర్గంలో ఏప్రిల్ 29 న పోలింగ్ సందర్భంగా పలు సెంటర్లలో హింస చోటుచేసుకుంది. కొన్ని కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. వివిధ పార్టీల అభ్యర్థుల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఫాల్తా నియోజకవర్గంలోని 15 పోలింగ్ బూత్​లలో మే2 రీపోలింగ్ చేపట్టింది. రీపోలింగ్ సందర్భంగా మరోమారు హింస చెలరేగడంతో మొత్తం నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఈ నెల 21న ఫాల్తాలో ఎన్నికల సంఘం అధికారులు మరోమారు పోలింగ్ చేపట్టనున్నారు.

కట్టుదిట్టమైన భద్రత.. సీసీ కెమెరాల నిఘా

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ కమిషన్ మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులను భారీగా మోహరించారు. ప్రతి కౌంటింగ్ హాల్‌‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, లెక్కింపు ప్రక్రియను లైవ్ రికార్డింగ్ చేస్తున్నారు. ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌‌లను తెరిచి, ప్రతి రౌండ్ ఫలితాన్ని అప్పటికప్పుడు డిక్లేర్ చేస్తారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపులో పారదర్శకత కోసం వీవీప్యాట్ స్లిప్పుల వెరిఫికేషన్ కూడా కీలకం కానుంది.

రాష్ట్రాల వారీగా సీట్ల వివరాలు

బెంగాల్ లో మొత్తం 294 సీట్లు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 148 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. ఇందులో  118  నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 71 సీట్లను గెలుచుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. అస్సాం అసెంబ్లీలో 126 సీట్లు ఉండగా.. మెజారిటీ మార్క్ 
64 సీట్లు గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో కొలువుతీరుతుంది. ఇక, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలలో 16 సీట్లలో గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

విజయోత్సవాలపై ఆంక్షలు

ఫలితాల తర్వాత గొడవలు జరగకుండా ఎన్నికల కమిషన్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. గెలిచిన అభ్యర్థులు భారీ ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతులు నిరాకరించారు. ముఖ్యంగా బెంగాల్​లోని సున్నిత ప్రాంతాల్లో ఫలితాల తర్వాత హింస చెలరేగకుండా అదనపు బలగాలను స్టాండ్‌‌బైలో ఉంచారు. గెలిచిన అభ్యర్థికి ఇచ్చే సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు కూడా పరిమిత సంఖ్యలోనే అనుచరులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.