- ఓటర్ల పరిశీలన, బూత్ల ఏర్పాటుపై యాజమాన్యంతో రిటర్నింగ్ ఆఫీసర్ చర్చలు
- ఆగస్టులో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు
- ఈ ఎన్నికల్లో రెండు బ్యాలెట్లు
- రీజియన్ స్థాయిలో ఒకటి.. రాష్ట్ర స్థాయిలో మరో బ్యాలెట్
- 36 వేల మందికే ఓటు హక్కు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలపై కసరత్తు మొదలైంది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించుతూ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. రెండు, మూడు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కార్మిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతాదాస్ గోపాల్ నియమితులయ్యారు.
ఐదు రోజులుగా ఆమె ఆర్టీసీ యాజమాన్యంతో ఎన్నికలఏర్పాట్లపై చర్చలు జరుపుతున్నారు. ఓటర్ల జాబితా పరిశీలన, బూత్ ల ఏర్పాటు, బూత్ ఏజెంట్ల నియామకం వంటి ఏర్పాట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో రిటర్నింగ్ అధికారి చర్చించారు. ఆగస్టులో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ఆర్టీసీలో చివరిసారిగా 2016 జూలై 19 న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. దీంతో ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
38 వేల మంది ఉద్యోగులు..
ఆర్టీసీలో మొత్తం 38 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే, ఇందులో సూపర్ వైజర్ నుంచి ఆపై స్థాయి అధికారులకు ఓటు హక్కు ఉండదు. ఈ లెక్కన ఆ అధికారుల సంఖ్య సుమారు 2 వేల వరకు ఉంటుంది. ఓటు హక్కు కలిగి ఉండేది కార్మికులు, ఉద్యోగులు మాత్రమే కావడంతో ప్రస్తుతం 36 వేల మందికి ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రతి కార్మికుడు రెండు ఓట్లను వేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం రెండు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి.
ఒక బ్యాలెట్ పేపర్ రీజియన్ స్థాయిలో గుర్తింపు సంఘం కోసం, మరో బ్యాలెట్ పేపర్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘం కోసం ఉంటుంది. రాష్ట్రంలో 11 రీజియన్లతోపాటు మరో 4 నాన్ ఆపరేషన్ రీజియన్లు ఉంటాయి. అంటే మొత్తం15 రీజియన్లలో గుర్తింపు సంఘం హోదా రావాలంటే 50.1 శాతం ఓట్లు తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘం హోదా పొందాలంటే సాధారణ మెజార్టీ వస్తే సరిపోతుంది.
మెట్టుదిగిన కార్మిక సంఘాలు..
ముందుగా వీలీనం.. ఆ తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు అంటూ ఇంతకాలం పట్టుబట్టిన కార్మిక సంఘాలు ఇప్పుడు ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలతో అలర్ట్ అయ్యాయి. గుర్తింపు సంఘం కోసం ఎన్నికల ఏర్పాట్లు ఊపందుకోవడంతో పలు యూనియన్ నేతలు కూడా అందుకు అనుగుణంగా తమ వైఖరిని మార్చుకుంటున్నారు. తమ క్యాడర్ ను అప్రమత్తం చేస్తున్నారు. రీజియన్ల వారీగా తమ ఎన్నికల ఓటు బ్యాంక్ ను కాపాడుకునే పనిలో పడ్డారు.
ఈ ఎన్నికల్లో గుర్తింపు సంఘం హోదా ఏ యూనియన్ కు దక్కితే.. ఆ యూనియన్ నేతలే విలీనం కమిటీలో ప్రాతినిధ్యం వహించే చాన్స్ ఉంది. దీంతో ఈసారి జరగనున్న ఎన్నికలు ప్రతి యూనియన్ కు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అనుబంధంగానే ఆర్టీసీలో యూనియన్లు ఉండడంతో ఇప్పుడు గుర్తింపు సంఘం హోదా కోసం జరగనున్న ఈ ఎన్నికల్లో నేరుగా రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగే అవకాశం ఉంది
