ట్రాఫిక్ కష్టాలకు ఇక కాలం చెల్లిపోనుంది. ఆకాశంలో ఎగిరే కార్లు అదేనండి ఎయిర్ టాక్సీలు త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా ఈ కలను సాకారం చేసే దిశగా అడుగు వేసింది. కాలిఫోర్నియాకు చెందిన ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ స్టార్టప్ జాబీ ఏవియేషన్‌లో టయోటా ఏకంగా 900 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు 8వేల కోట్ల రూపాయలకు పైమాటే. భవిష్యత్తు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ భారీ డీల్ జరిగింది.
ఎయిర్ టాక్సీ ప్రత్యేకతలను గమనిస్తే.. ఇది ఆరు రోటర్లతో పనిచేసే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనం. ఇది నిటారుగా టేకాఫ్ అవ్వడమే కాకుండా.. గాల్లో నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది. నగరాల్లో కిక్కిరిసిన ట్రాఫిక్‌లో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేర్చేస్తుంది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా.. టయోటా తన తయారీ నైపుణ్యాన్ని కూడా ఈ స్టార్టప్‌కు అందిస్తోంది. దీనివల్ల జాబీ ఏవియేషన్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకోగలుగుతోంది.
ప్రస్తుతం నెలకు ఒక ఎయిర్ టాక్సీని మాత్రమే తయారు చేస్తున్న ఈ సంస్థ.. టయోటా సహకారంతో 2027 నాటికి నెలకు నాలుగు ఎయిర్ టాక్సీలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టయోటా ఇంజనీర్లు నేరుగా కాలిఫోర్నియాలోని తయారీ కేంద్రంలో పనిచేస్తూ.. ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. రవాణా రంగంలో కేవలం రోడ్లకే పరిమితం కాకుండా.. మొబిలిటీ ఫర్ ఆల్ అనే నినాదంతో టయోటా ఆకాశ మార్గంలో కూడా కొత్త ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీలకు ఊతం ఇస్తోంది.
ALSO READ : టాటా పంచ్ EV కొత్త మోడల్ వచ్చేసింది
పర్యావరణ హితమైన, శబ్దం లేని ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వస్తే.. ఎయిర్ పోర్టులకు వెళ్లడం, ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించడం చాలా సులభతరం అవుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో వీటి ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. రాబోయే 5 ఏళ్లలో ఆకాశంలో ఈ ఎయిర్ టాక్సీల సందడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. సాంకేతికత, పెట్టుబడి తోడైతే అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అవుతుందని టయోటా మరోసారి నిరూపించింది. చూడాలి ఇండియాకి వీటి రాక ఎప్పుడు, అవి ఎంత వరకూ అందరికీ అందుబాటు రేట్లలోకి వస్తాయి అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
