- బిల్లులు కట్టాల్సిందే అంటున్న డిస్కంలు
- ఆర్థిక సంఘం నిధుల నుంచి బిల్లులు చెల్లించాలంటూ అధికారుల ఆదేశాలు
- అలా.. ఎలా చెల్లిస్తారంటూ కార్యదర్శులను అడ్డుకుంటున్న సర్పంచులు
- ఆర్థిక సంఘం నిధుల నుంచి బిల్లులు ఎలా కడ్తారని బండి సంజయ్ ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఒకవైపు పేరుకుపోయిన బకాయిలు చెల్లించాల్సిందేనని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఒత్తిడి తెస్తుండగా, మరోవైపు కేంద్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి ఈ బిల్లులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ జారీ చేసిన ఆదేశాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 12,706 గ్రామ పంచాయతీలు ఉండగా.. విద్యుత్ శాఖకు సుమారు రూ.1,700 కోట్ల బకాయిలు పడినట్లు పంచాయతీరాజ్ శాఖ గుర్తించింది. ఈ బకాయిలు దాదాపు రెండున్నరేండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో వాటిపై పర్యవేక్షణ కొరవడటంతో కరెంట్ బిల్లులపై ఎవరూ దృష్టించి సారించలేదు. దీంతో క్రమంగా పంచాయతీల్లో కరెంట్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి.
గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, మిషన్ భగీరథ పంపింగ్‌తో పాటు వీధి దీపాలతో విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో పంచాయతీలకు కరెంట్ బిల్లులు భారీగా వస్తున్నాయి. వినియోగం పెరిగినా, దానికి తగినట్లుగా పంచాయతీలకు నిధులు రాకపోవడంతో ఏండ్లుగా బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి.
కార్యదర్శులను అడ్డుకుంటున్న సర్పంచులు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీల ఖాతాల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలను డిజిటల్ కీస్ ఉపయోగించి చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శులు ప్రయత్నిస్తుండగా.. సర్పంచులు, స్థానిక ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలను ఆర్థిక సంఘం నిధుల నుంచి ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు.
ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం.. స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి కనీస సేవలకు ఈ నిధులను వినియోగించుకోవచ్చని పంచాయతీ ఆఫీసర్లు చెప్తున్నారు. గ్రామాల్లో విద్యుత్ వినియోగం కూడా కనీస సేవల పరిధిలోకి వస్తుందని, నిబంధనల ప్రకారమే బకాయిలు చెల్లించాలని ఆదేశించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద కరెంట్ బిల్లులు కట్టవచ్చని పేర్కొంటున్నారు. పంచాయతీ అవసరాలకే కరెంట్ వినియోగించారు కాబట్టి బిల్లుల చెల్లింపును ఎవరూ అడ్డుకోవద్దని కోరుతున్నారు. పాత బకాయిలను అప్పటి ప్రత్యేక నిధుల ద్వారా కానీ, ప్రభుత్వ ప్రత్యేక గ్రాంట్ల ద్వారా క్లియర్ చేయాలి.. అలా కాకుండా ప్రస్తుతం గ్రామాల్లో మౌలిక వసతుల కోసం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను పాత విద్యుత్ బిల్లులకు మళ్లిస్తే.. గ్రామాల్లో మురుగు కాల్వల నిర్వహణ, రోడ్లు, పారిశుధ్య పనులు తాగు నీటి పైపుల లీకేజీల మరమ్మతులు వంటి అత్యవసర పనులకు పైసలు ఎక్కడి నుంచి తేవాలని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. పలు జిల్లాల్లో కార్యదర్శులను నిధులు డ్రా చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నట్లు సమాచారం.
మరోవైపు, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.30 కోట్ల వరకు పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా బకాయిలు చెల్లించేలా చూడాలని డీపీఓలకు పీఆర్ ఉన్నతాధికారులు ఆదేశించడంతో వారు కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. కరెంట్ బకాయిలు చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తే పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీలిస్తామని మౌఖికంగా చెప్తున్నారని కార్యదర్శులు వాపోతున్నారు.
ఆర్థిక సంఘం నిధులు ఎలా మళ్లిస్తారు?: బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించే ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బకాయిల చెల్లింపులకు ఎలా మళ్లిస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్)కు ఆయన లేఖ రాశారు.
గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించాల్సిన నిధులను సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ల ఈఎంఐల చెల్లింపులకు మళ్లించడం సరికాదన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల (2020–-21, 2025–-26) కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రూ.3,023.15 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉండగా, పంచాయతీ ఎన్నికల ఆలస్యం వల్ల జాప్యం జరిగిందని చెప్పారు. ఎన్నికల అనంతరం ఇటీవల విడతలవారీగా రూ.2,293.74 కోట్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. కేంద్ర నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని, నిధులను దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని లేఖలో ఆయన కోరారు.
