తెలంగాణలో భారీగా పెరిగిన కరెంటు వాడకం

తెలంగాణలో భారీగా పెరిగిన కరెంటు వాడకం
  • వేసవిని తలపిస్తున్న విద్యుత్‌ వినియోగం 
  • వర్షాలు లేక పెరిగిన బోర్ల వాడకం
  • 25న 14,361 మెగావాట్ల డిమాండ్
  • వానాకాలంలో ఇదే ఆల్‌టైమ్‌ రికార్డ్  

హైదరాబాద్‌, వెలుగు :  రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. వానాకాలంలోనూ వేసవి తరహాలో కరెంటు వాడకం నమోదవుతోంది. ఈ నెల 15 నుంచి విద్యుత్‌ డిమాండ్‌ అధికమవుతూ వస్తోంది. శుక్రవారం(ఈ నెల 25) రోజున14,361 మెగావాట్ల విద్యుత్‌ పీక్ డిమాండ్‌ నమోదైంది. వానాకాలం సమయంలో ఇంత పెద్ద ఎత్తున విద్యుత్‌ డిమాండ్ రావడం ఆల్‌టైమ్‌ రికార్డ్ అని ఎక్స్​పర్ట్స్అంటున్నరు. 

నిరుడు వానాకాలం ఆగస్టు 24న 13,079 మెగావాట్లుగా నమోదైంది. ఈ యేడు మరో 1,361 మెగావాట్లు అధికంగా నమోదవడం రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రతను స్పష్టం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 49.21 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిరుడు  64.54 లక్షలు ఎకరాలు సాగు కాగా ఈ యేడు దాన్ని మించి 65 లక్షల ఎకరాలకు పైగా నాట్లు పడతాయని అగ్రికల్చర్‌ అధికారులు అంచనా వేశారు. సీజన్‌లో గత నెల రోజులుగా వర్షాలు లేక పోవడంతో పంటలకు బోర్లు, మోటర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. దీంతో డిమాండ్ మరింత పెరుగుతోందని ఎలక్ట్రిసిటీ అధికారులు అంటున్నారు. 

వేసవిలో అత్యధికంగా 15,497 మెగావాట్లు  

రాష్ట్రంలో వినియోగం అవుతున్న కరెంటులో 37 శాతం వ్యవసాయ రంగానికే వాడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. సాధారణంగా వేసవిలో బోర్లు, విద్యుత్‌ మోటర్ల వాడకం అధికంగా ఉండడంతో ఎక్కువ కరెంటు వాడకం ఉంటుంది. కానీ వానాకాలంలో ఇంత డిమాండ్‌ ఉండదు. ఎండాకాలంలో మార్చి 30న రాష్ట్రంలో అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌15,497 మెగావాట్లుగా నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం. కానీ ఇప్పుడు వానాకాలంలోనే విద్యుత్ వినియోగంలో ఇంత ఎక్కువ డిమాండ్‌ నమోదు కావడం చూస్తుంటే వేసవిని తలపిస్తోందని చెప్తున్నారు.