వైటీపీఎస్‌‌ ఆపరేషన్, మెయింటెనెన్స్ బాధ్యతలు ప్రైవేట్కు అప్పగించొద్దు: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ

వైటీపీఎస్‌‌ ఆపరేషన్, మెయింటెనెన్స్ బాధ్యతలు ప్రైవేట్కు అప్పగించొద్దు: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ
  •     రాష్ట్ర విద్యుత్​ ఉద్యోగుల జేఏసీ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ బాధ్యతలు ప్రైవేట్​కు అప్పగించొద్దని రాష్ట్ర విద్యుత్​ ఉద్యోగుల జాయింట్​ యాక్షన్​ కమిటీ డిమాండ్​ చేసింది. యాష్  హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఏహెచ్​పీ), కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్ పీ) నిర్వహణ కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్ప జెప్పడానికి జారీ చేసిన టెండర్‌‌ను వెంటనే రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్​ జలసౌధలోని రాష్ట్ర టీజీ జెన్​కో హెచ్​ఆర్​ డైరెక్టర్​ఎస్వీ కుమార్​రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీపీఈజేఏసీ చైర్మన్ సాయిబాబా మాట్లాడుతూ ప్రస్తుతం వైటీపీఎస్ స్టేజ్-–1లోని 1,2 యూనిట్లు, స్టేజ్–-2లోని 3, 4  యూనిట్లను అతి తక్కువ మంది ఉద్యోగులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఐదో యూనిట్-కూడా 2026 సెప్టెంబర్‌‌లో కమర్షియల్ ఆపరేషన్‌‌కు సిద్ధమవుతుందని పేర్కొన్నారు. ఇంతటి కీలక  యూనిట్ల సమర్థవంతమైన నిర్వహణకు తగినంత సిబ్బంది అవసరమని తెలిపారు. ఇప్పటికే ఉన్న జెన్‌‌కో సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించకుండా ప్రైవేట్ కు నిర్వహణ బాధ్యతలు అప్పగించడం వల్ల సంస్థపై అదనపు భారం పడుతుందని వివరించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ పి.రత్నాకర్ రావు, జనరల్ సెక్రటరీ ఈ.శ్రీధర్, నాయకులు తదితరులు ఉన్నారు.