ఎల్లంపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్..85.10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో ఏర్పాటు

ఎల్లంపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్..85.10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో ఏర్పాటు
  • ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మంజూరు 
  • మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్​ ఆమోదం 
  • తాజాగా ఇరిగేషన్​ ల్యాండ్  ఫిషరీస్​కు కేటాయిస్తూ జీవో జారీ
  • రాష్ట్రంలోనే మొదటి ఆక్వా పార్క్​ ఏర్పాటుతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటిగ్రేటెడ్  ఆక్వా పార్క్​ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్​వై) కింద రాష్ట్రానికి మంజూరైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తూ స్టేట్​ క్యాబినెట్​ ఇటీవల ఆమోదించింది. దీనికి అవసరమైన 85.10 ఎకరాల ఇరిగేషన్​ ల్యాండ్​ను ఫిషరీస్​ డిపార్ట్​మెంట్​కు కేటాయిస్తూ గత నెల 28న ప్రభుత్వం జీవో నంబర్​ 183 జారీ చేసింది. దాదాపు రూ.100 కోట్లతో ఆక్వా పార్క్​ను ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు తెలిపారు. ఇందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, మిగతా 40 శాతం​రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. డీపీఆర్​ పూర్తయిన వెంటనే టెండర్లు నిర్వహించి సీఎం రేవంత్​రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలోనే మొదటి ఆక్వా పార్క్

ఇంటిగ్రేడెట్​ ఆక్వా పార్క్​ను ఆధునిక పద్ధతుల్లో నిర్మించనున్నారు. ఇది రాష్ట్రంలోనే మొదటిది కావడం విశేషం. ఇందులో చేపల విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తో పాటు వివిధ రకాల చేపల ప్రదర్శనకు మ్యూజియం, ఆక్వా రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించడం కోసం ట్రైనింగ్​ సెంటర్, మత్స్య సేవా కేంద్రాలు, కోల్డ్​ స్టోరేజీలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉత్పత్తయ్యే సీడ్​ను రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సప్లై చేయనున్నట్లు సమాచారం. అలాగే టూరిజం డెవలప్​మెంట్​లో భాగంగా వివిధ రకాల చేపల ప్రదర్శనకు మ్యూజియం, వాటర్​ గేమ్స్, కెఫెటేరియా నిర్మించనున్నారు. ఆక్వా పార్క్​ ఏర్పాటుతో ఇటు మత్స్య సంపద అభివృద్ధితో పాటు టూరిస్టులను ఆకర్షించేలా తీర్చిదిద్దనున్నారు. 

45 ఎకరాల్లో ముర్రెల్​ క్లస్టర్

ఇంటిగ్రేటెడ్​ ఆక్వా పార్క్​లో భాగంగా దాదాపు 45 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్​ ముర్రెల్​(కొర్రమీను) క్లస్టర్​ ఏర్పాటు కానుంది. బొమ్మచేప, కొర్రమట్టగా పిలిచే ముర్రెల్​ను రాష్ట్ర చేపగా ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. చేపల్లో వీటిది ప్రత్యేక స్థానం. ఇవి చాలా రుచికరంగా ఉండడంతో డిమాండ్​ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం డిమాండ్​కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ముర్రెల్​ క్లస్టర్​ ఏర్పాటుతో ఈ కొరత తీరడంతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయిలో వీటి ఉత్పత్తి జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇంటిగ్రేటెడ్​ ఆక్వా పార్క్​లో సుమారు వంద మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. ఇందులో మత్స్య సహకార సంఘాలు, మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 

మత్స్య సంపద అభివృద్ధి

ఆక్వా పార్క్​ ఏర్పాటుతో మత్స్య సంపద ఉత్పత్తి, అభివృద్ధిలో జిల్లాకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేపల పెంపకం ద్వారా వందల మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. ఏటా వానాకాలంలో ఫిషరీస్​ డిపార్ట్​మెంట్​ ద్వారా చేప విత్తనం పోస్తున్నారు. ముఖ్యంగా రాహు, బంగారుతీగ, ముర్రెల్​తో పాటు రొయ్యలను హైదరాబాద్, నాగపూర్​ సహా వెస్ట్​బెంగాల్​కు ఎక్స్ పోర్ట్​ చేస్తున్నారు.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో ఈసారి వాటిలో సీడ్​ వేయలేదు. ఇంటిగ్రేటెడ్​ ఆక్వా పార్క్, ముర్రెల్  క్లస్టర్​ ఏర్పాటుతో రానున్న రోజుల్లో జిల్లాలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరగడమే కాకుండా రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.