కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఎల్ నినో ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో 19 వేల 892 మెగావాట్లకు చేరిక

కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఎల్ నినో ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో 19 వేల 892 మెగావాట్లకు చేరిక
  • విద్యుత్​కొనుగోలుకు 3 నెలల్లో రూ.2,387 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం
  • గతేడాదితో పోలిస్తే 4 వేల మిలియన్ యూనిట్లు అదనం
  • సగటు రేటు రూ.2.46 నుంచి రూ.5.15కు జంప్ 
  • 25 శాతానికి పడిపోయిన జల విద్యుత్

హైదరాబాద్, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరెంట్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలను కాపాడుకునేందుకు రైతులు బావులు, బోర్లపై ఆధారపడడం, ఎండలు, ఉక్కపోత కారణంగా గృహ విద్యుత్​వినియోగం పెరగడంతో డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరింది.

 అదే సమయంలో ప్రాజెక్టుల్లో నీళ్లు లేక జల విద్యుత్​ 25 శాతానికి పడిపోవడం, బొగ్గు కొరత వల్ల థర్మల్​విద్యుత్​తగ్గడంతో ఈ లోటును పూడ్చేందుకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం వేల కోట్లు కుమ్మరించాల్సి వస్తోంది. ఇటు కావాల్సిన విద్యుత్​పెరగడం, అటు రేట్లు భగ్గుమనడంతో డిస్కంలపై మోత మోగుతున్నది.

 2025 సెప్టెంబర్ నెలలో ఎక్స్ఛేంజ్ కొనుగోలు వ్యయం రూ.222 కోట్లు మాత్రమే ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అది ఏకంగా 362 శాతం పెరిగి రూ.1,024 కోట్లకు చేరింది. ఇక జూలై నుంచి సెప్టెంబర్ వరకు తీసుకుంటే.. 2025లో ఎక్స్ఛేంజ్ కొనుగోలు ఖర్చు రూ.1,126 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.2,387 కోట్లకు చేరింది. 

గత నెలలో 121 శాతం పెరిగింది

జల విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం, ఎండలతో డిమాండ్ పెరగడంతో గత నెలలో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు పవర్ ఎక్స్ఛేంజీల నుంచి రికార్డు స్థాయిలో కరెంట్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. 2025 సెప్టెంబర్ లో ఎక్స్ఛేంజీల నుంచి 900 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేయగా, ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 121 శాతం పెరిగి 1,989 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. గతేడాది కిలోవాట్ అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు(యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు) రూ.2.46 మాత్రమే ఉండగా, ఈ ఏడాది అది 109 శాతం పెరిగి రూ.5.15కు చేరింది. 
 

వేసవి తీవ్రత ఉన్న మార్చితో పోలిస్తే అధికం

నివేదికల ప్రకారం.. గత నెల 30న పీక్ డిమాండ్ ఏకంగా 19,892 మెగావాట్లకు చేరి, రాష్ట్ర చరిత్రలోనే ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ రికార్డు నమోదు చేసింది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న మార్చి 27న నమోదైన 18,548 మెగావాట్ల రికార్డుతో పోలిస్తే ఇది 1,344 మెగావాట్లు అధికం. అలాగే, 2025 సెప్టెంబర్ పీక్ డిమాండ్ 15,906 మెగావాట్లతో పోలిస్తే ఈసారి ఏకంగా 25.1 శాతం మేర పెరిగింది. 

వినియోగించిన మొత్తం విద్యుత్.. 2025 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7,149 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబర్​లో అది 23.5 శాతం పెరిగి 8,831 మిలియన్ యూనిట్లకు చేరింది. ఇక, జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో విద్యుత్ సరఫరా 2025లో 22,319 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది 16.7 శాతం వృద్ధితో 26,036 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. 

75.2 శాతం తగ్గిన జల విద్యుత్​

ఎల్ నినో కారణంగా తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో రాష్ట్రంలో చౌకగా జరిగే జల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. 2025 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 3,748 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి కాగా, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నాటికి అది కేవలం 931 మిలియన్ యూనిట్లకు పరిమితమైంది. 

దీంతో జల విద్యుత్​ఉత్పత్తిలో ఏకంగా 75.2 శాతం మేర తగ్గుదల నమోదైంది. 2025 జూన్-సెప్టెంబర్ కాలంలో మొత్తం విద్యుత్ వినియోగంలో జల విద్యుత్ వాటా 13.1 శాతంగా ఉండగా, ఈ ఏడాది అది 2.8 శాతానికి పడిపోయింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు లేకపోవడం వల్ల సున్నా ఇంధన వ్యయంతో వచ్చే జల విద్యుత్ లభ్యత రికార్డు స్థాయిలో పడిపోయింది. దీంతో గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పడిన భారీ విద్యుత్ లోటును భర్తీ చేయడానికి పూర్తిగా బయటి వనరులపైనే ఆధారపడాల్సి వచ్చిందని విద్యుత్​శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు.