Elon Musk: గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎలాన్ మస్క్.. ఎందుకో తెలుసా..? 

Elon Musk: గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎలాన్ మస్క్.. ఎందుకో తెలుసా..? 

న్యూయార్క్ : టెస్లా CEO, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఎలాన్ మస్క్ అత్యధిక సంపదలోనే కాదు..అతిపెద్ద నష్టంలోనూ రికార్డు సృష్టించి గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. అనతికాలంలో ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఎదిగిన ఎలాన్‌ మస్క్‌ ..అంతేవేగంగా తన సంపద కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల మస్క్  వ్యక్తిగత ఆస్తులు భారీగా క్షీణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో చరిత్రలో అత్యంత సంపదను కోల్పోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించినట్లు ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ (GWR)’ ప్రకటించింది.

ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ ఒక్క ఏడాది వ్యవధిలోనే (2021-2022) దాదాపు 182 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైందని అంచనా. ఇతర నివేదికలను బట్టి చూస్తే ఈ నష్టం వాస్తవానికి 200 బిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. చరిత్రలో ఏ సంపన్నుడూ ఈ స్థాయి నష్టాన్ని చవిచూడలేదని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ పేర్కొంది.

ప్రపంచంలోనే సంపన్న వ్యక్తిగా నిలిచిన మస్క్‌ సంపద 2021లో 320 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజాగా (2023 జనవరి) అది 138 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతకుముందు ఏడాది 58.6 బి.డాలర్ల నష్టంతో రికార్డు నెలకొల్పిన ఆయన.. తాజాగా తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. ఇలా భారీగా వ్యక్తిగత సంపదను కోల్పోయిన వ్యక్తిగా ఎలాన్‌ మస్క్‌ రికార్డు సృష్టించినట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు వెల్లడించింది.

ఎలాన్‌ మస్క్‌ ఆస్తులు అత్యధికంగా టెస్లా స్టాక్స్‌ రూపంలోనే ఉన్నాయి. ఇటీవల ఆ సంస్థ షేర్లు భారీగా పతనం అవడంతో పాటు చాలా షేర్లను మస్క్‌ విక్రయిస్తున్నారు. ఆస్తుల విలువ తగ్గినప్పటికీ ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా టెస్లానే కొనసాగుతుండటం మరో విశేషం. మరోవైపు చరిత్రలోనే అత్యంత సంపద కోల్పోయిన వ్యక్తిగా మస్క్‌ రికార్డు సృష్టించినప్పటికీ ప్రపంచ కుబేరుల్లో ఎలాన్‌ మస్క్‌ ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ సుమారు 198 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు.