కూలీలకు ఎమర్జెన్సీ టికెట్లు ఇస్తం

కూలీలకు ఎమర్జెన్సీ టికెట్లు ఇస్తం

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ వల్ల మన రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీల తరలింపు విషయంలో రైల్వే శాఖ ఎట్టకేలకు దిగొచ్చింది. వలస కార్మికులను తరలించేందుకు ఎమర్జెన్సీ కోటాలో టికెట్లు ఇస్తామని తెలిపింది. సాధారణ రైళ్లకు అదనంగా బోగీలను మాత్రం యాడ్ చేయడం వీలు కాదని హైకోర్టుకు విన్నవించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలోనే ఉండిపోయిన 45 మంది బీహార్ కూలీలను బుధవారమే పంపిస్తామని, వారికి ఎమర్జెన్సీ కోటాలో టికెట్లు ఇస్తామని హైకోర్టుకు తెలియజేశారు. 34 మందిని స్లీపర్‌‌ క్లాస్‌‌లో, మిగిలిన వాళ్లను ఏసీ బోగీల్లో పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. వలస కూలీలను తరలించేందుకు రెగ్యులర్ రైళ్లకు ఒక్క బోగీ యాడ్ చేయలేరా? అని హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడంతో డీఆర్ఎం ఈ ప్రపోజల్ చేశారు. దీనిపై స్పందించిన చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్ బెంచ్ టికెట్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించాలని ప్రొఫెసర్‌‌ రామశంకర్‌‌ నారాయణ మేల్కొటి, లాయర్‌‌ పీవీ కృష్ణయ్య, మానవ హక్కుల వేదిక ప్రతినిధి జీవన్‌‌ కుమార్‌‌ ఫైల్ చేసిన పిల్స్ ను బెంచ్ విచారించింది.