V6 News

ఉద్యోగుల బకాయిలు వెయ్యి కోట్లు రిలీజ్.. నెలకు రూ.700 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెరిగిన చెల్లింపులు

ఉద్యోగుల బకాయిలు వెయ్యి కోట్లు రిలీజ్..  నెలకు రూ.700 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెరిగిన చెల్లింపులు
  • అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ.1000  కోట్ల నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతినెల ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను రీలిజ్ చేస్తూ వచ్చింది. 

అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాలను, వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించిన ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. 2025 అక్టోబర్ వరకు పెండింగ్‌‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలన్నింటినీ ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా, ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు చెల్లించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.


ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క రోజు కూడా జాప్యం లేకుండా మెడికల్ బిల్లుల చెల్లింపులు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా జరిగేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. దాదాపు 8 వేల కోట్ల మేర ఉద్యోగులకు సంబంధించి బకాయిలు పెండింగ్​లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచింది. దీంతో మూడేండ్లపాటు రిటైర్మెంట్లు జరగలేదు. ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంతకుముందు మూడేండ్లు ఎలాంటి రిటైర్మెంట్ల భారం ప్రభుత్వంపై పడలేదు. 

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ప్రతి ఏడాది యావరేజ్ గా 9,500 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు బెనిఫిట్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బకాయిలకు తోడు, కొత్తగా ప్రతిఏటా రూ.6 వేల కోట్ల అవసరం పడుతున్నది. అందులో భాగంగానే ప్రతినెలా కొంత మొత్తంలో చెల్లింపులు చేస్తూ బకాయిలు పూర్తిగా తీసేయాలని, ఎప్పటికప్పుడు ఉద్యోగులకు చెల్లింపులు ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.