బదిలీ నిబంధనలను అధికారులే పాటిస్తలే..ఉద్యోగుల జేఏసీ ఆరోపణ 

బదిలీ నిబంధనలను అధికారులే పాటిస్తలే..ఉద్యోగుల జేఏసీ ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొంత మంది ఉన్నతాధికారులు తుంగలో తొక్కుతున్నారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ రావు ఆరోపించారు. జీవో నంబర్ 38 ద్వారా ప్రభుత్వం బదిలీల  మార్గదర్శకాలు విడుదల చేసినా, కొన్ని శాఖల్లో ఉత్తర్వులకు వక్ర భాష్యం చెబుతూ  నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్​అయ్యారు.

ఓ స్టేషన్​లో నాలుగేండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరి బదిలీ చేయాలని, కానీ బదిలీలు 40 శాతం మించరాదని ఉన్నా ఆర్థిక, ఆయుష్, సంక్షేమ శాఖల్లో  4 ఏండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్నవారిని మొత్తం బదిలీ చేసినా 40 శాతం మించడం లేదనే కారణంతో మూడేండ్ల సర్వీస్​ పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేస్తామనడం అన్యాయమన్నారు. ఎస్సీ డెవలప్​మెంట్​కమిషనర్​ ఉద్యోగ సంఘాల నాయకులకు కల్పించిన వెసులుబాటును నిరాకరించడం సరికాదన్నారు.