- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిశోర్
చిట్యాల, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధ్యానం ఇస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిశోర్ చెప్పారు. నల్గొండ జిల్లా జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఉపాధి హామీ, జలశక్తి అభియాన్ కింద చేపట్టిన పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా పనులు ఎలా జరుగుతున్నాయి ? వేతనాలు సమయానికి అందుతున్నాయా ? సౌకర్యాలు కల్పిస్తున్నారా ? అని ఉపాధి కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మహిళా సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. అన్ని గ్రామపంచాయతీ భవనాలను డిసెంబర్‌నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి పంచాయతీ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం నల్గొండ కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ రాజ్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 1.23 లక్షల పనిదినాలు కల్పించి మొదటి స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ బి. చంద్రశేఖర్‌ను, ఎంపీడీవోలను అభినందించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లాలని, భవిష్యత్‌లో దీని మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ఊట కుంటలు, ఉద్యానవన పంటలు, డెయిరీ, కూరగాయల సాగుకు గ్రామాల్లో ఎంతో అవకాశం ఉంటుందని, వీటి వల్ల ప్రజల ఆదాయం సైతం పెరుగుతుందన్నారు.
కార్యక్రమంలో స్పెషల్ కమిషనర్ లక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి, జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఏపీడీ నరసింహారావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు
మాధవి పాల్గొన్నారు.
