సెక్రటేరియట్ డిస్పెన్సరీకి ఫండ్స్​ లేవ్​.. మందుల్లేవ్

సెక్రటేరియట్ డిస్పెన్సరీకి ఫండ్స్​ లేవ్​.. మందుల్లేవ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ లో ఉద్యోగులకు మందుల కొరత ఏర్పడింది. సెక్రటేరియట్ డిస్పెన్సరీలో మందుల్లేక ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవటంతో మూడు నెలలుగా డిస్పెన్సరీలో మందులు లేవు. వరుసగా వర్షాలు పడుతుండటం, వాతావరణం మారిపోతుండటం, సెక్రటేరియట్ షిప్టింగ్ తో ఉద్యోగులు పలు అనారోగ్య సమస్యలు, జ్వరాల బారినపడుతున్నారు. అయితే డిస్పెన్సరీలో మందులు లేకపోవడంతో డాక్టర్లు కేవలం ట్రీట్ మెంట్ చేసి, మందులు బయట కొనుక్కోవాలని రాసిస్తున్నారు. సెక్రటేరియట్ లో  రెగ్యులర్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపి సుమారు2 వేల మంది పని చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. వీరితో పాటు కార్యదర్శులు, ఉన్నతాధికారులు కూడా ఇక్కడి నుంచే వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతి నెలా ఈ డిస్పెన్సరీలో మందులకు రూ.25 లక్షల వరకు నిధులు అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

వానాకాలం రోగాలతో సతమతం

వానాకాలం టైఫాయిడ్ , డెంగీ వంటి జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలో మార్పుల వల్ల కూడా విష జ్వరాలు వస్తున్నాయి. మరోవైపు  ఆగస్టు నుంచి సెక్రటేరియట్ లోని శాఖలను బీఆర్కే భవన్ కు షిఫ్ట్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బీరువాల్లో, ర్యాక్ లో ఉన్న పాత ఫైళ్లను తీయటం, సర్దటం, బస్తాల్లో ప్యాక్ చేసే ప్రక్రియ నాలుగైదు నెలలు సాగింది. దీంతో దుమ్ము, ధూళి వల్ల ఉద్యోగులు పలు సమస్యలకు గురయ్యారు. రెండు నెలలుగా సాగుతున్న షిప్టింగ్ దాదాపుగా పూర్తయింది. ఇక తాత్కాలిక సెక్రటేరియట్ గా బీఆర్కే భవన్ లో మెజారిటీ శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ మరమ్మతులు సాగుతుండటం, పెయింట్, సున్నం వేస్తుండటం, వెంటిలేషన్, గాలి లేకపోవటం, పక్కనుంచి హుస్సేన్ సాగర్ కాలుష్యంతో జ్వరాలు వస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. కొంత మంది ఉద్యోగులు మాస్క్ లు కట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. డిస్పెన్సరీలో చూపించుకున్నా మందులు లేవని వైద్యులు, సిబ్బంది చెబుతుండటంతో చేసేదేమి లేక బయట కొంటున్నారు. పాత సెక్రటేరియట్ లోని డిస్పెన్సరీని బీఆర్కే భవన్ కు షిఫ్ట్ చేసే పక్రియ పూర్తయేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి.

మెడికల్ ఏజెన్సీలకు బిల్లులు పెండింగ్

సెక్రటేరియట్ డిస్పెన్సరీకి మందులను సరఫరా చేసే మెడికల్ ఏజెన్సీలకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నాలుగు నెలల క్రితం వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని మెడికల్ ఏజెన్సీ మందులు సరఫరా చేసింది. బిల్లులు సకాలంలో చెల్లించకపోవటంతో ఆ ఏజెన్సీ అగ్రిమెంట్ రద్దు చేసుకున్నది. ఆ తర్వాత నాంపల్లిలోని మరో ఏజెన్సీతో మందుల సరఫరాకు అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఏజెన్సీకి కూడా బిల్లులు పెండింగ్ లో పడ్డాయని తెలుస్తోంది.  బకాయిలను వచ్చే నెలలో చెల్లిస్తామని ఏజెన్సీ ప్రతినిధులకు డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.

వెంటనే నిధులు విడుదల చేయాలె 

నాలుగు నెలలుగా ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవటంతో మందులు సరఫరా నిలిచిపోయింది. బకాయిలు చెల్లించకపోవ డంతో మెడికల్ ఏజెన్సీ వారు మందులు ఆపేశారని చెబుతున్నారు. డిస్పెన్షనరీలో మందులు లేకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం.

– సెక్రటేరియట్ లో పని చేస్తున్న ఓ ఆఫీసర్

షిఫ్టింగ్ తో అనారోగ్య సమస్యలు

రెండు నెలలుగా సెక్రటేరియట్ షిప్టింగ్ తో ఉద్యోగులకు జలుబు, దగ్గు, శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డిస్పెన్సరీకి మందుల సరఫరా ఆగిపోయింది. కొత్త బడ్జెట్ వచ్చిన తరువాత నిధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లలేక ఉద్యోగులు, వారి కుటంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

– సెక్రటేరియట్ లో పని చేస్తున్న మరో ఆఫీసర్