అక్రమంగా వచ్చినోళ్లతో బెంగాలీల ఉపాధికి గండి : ప్రధాని మోదీ

అక్రమంగా వచ్చినోళ్లతో బెంగాలీల ఉపాధికి గండి : ప్రధాని మోదీ
  •     బెంగాల్​ డెమోగ్రఫీ మారుతోందన్న ప్రధాని మోదీ
  •     ఫేక్ సర్టిఫికెట్లతో ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు
  •     బెంగాల్​లో మతువాలు, హిందువులు ఉండడం టీఎంసీకి ఇష్టం లేదని కామెంట్

కక్​ద్వీప్​(బెంగాల్)​: అక్రమ చొరబాట్లతో బెంగాల్​లో డెమోగ్రఫీ (జనాభా విధానం) మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. అక్రమంగా రాష్ట్రంలో ప్రవేశిస్తున్నవారు స్థానిక యువత అవకాశాలను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇలా అక్రమంగా వచ్చేటోళ్లకు తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ) సర్కారు నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఇస్తూ, ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లను కట్టబెడుతోందని మండిపడ్డారు.

బుధవారం ఆయన బెంగాల్​లోని కక్​ద్వీప్, ఒడిశాలోని మయూర్​భంజ్​, బాలాసోర్​​లో చివరి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘బెంగాల్​సరిహద్దు ప్రాంతాల్లో డెమోగ్రఫీ మారుతోంది. పొరుగు దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొన్న  మైనార్టీలు మన దేశంలో ఏళ్ల తరబడి ఆశ్రయం పొందుతున్నారు. వారికి పౌరసత్వం ఇచ్చేందుకు తీసుకొచ్చిందే సీఏఏ.. అయితే, దీనిని టీఎంసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

సీఏఏ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో మతువాలు, హిందువులు ఉండడం ఆ పార్టీకి ఇష్టంలేదు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ మతువా కమ్యూనిటీకి భారత పౌరసత్వం ఇచ్చి తీరుతం. కేంద్ర పథకాలను టీఎంసీ సర్కారు అమలు చేయలేదు. ​ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో టీఎంసీ పార్టీ కనుమరుగైపోతుంది’ అని మోదీ చెప్పారు.

పట్నాయక్ ​ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర

ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనుక కుట్ర ఉందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తామని మోదీ వెల్లడించారు. ‘నవీన్ బాబు ఆరోగ్యం క్షీణించడంపై ఆయన శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది కాలంగా ఆయన ఆరోగ్యం నానాటికీ దిగజారుతోంది.

దీని వెనుక కుట్ర ఉందా? ప్రస్తుతం ఆయన తరఫున ప్రభుత్వాన్ని నడుపుతున్న లాబీ దీనికి కారణమా? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం” అని పేర్కొన్నారు. 5 దశాబ్దాల తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ఫుల్​ మెజార్టీ గవర్నమెంట్​ఏర్పడబోతున్నదని చెప్పారు. తన పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 వ స్థానంనుంచి ఐదో స్థానానికి చేరుకున్నదని తెలిపారు.