ఆసిఫాబాద్​ అడవుల్లో ఎన్​కౌంటర్

ఆసిఫాబాద్​ అడవుల్లో ఎన్​కౌంటర్

ఇద్దరు మావోయిస్టులు మృతి

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కడంబ అడవుల్లో శనివారం రాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు జిల్లా స్థాయి మావోయిస్టు నేతలు మృతిచెందినట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు భారీగా కూంబింగ్​ చేపట్టారు. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ వైవీఎస్ సూధేంద్ర టీమ్​కు సాయుధ మావోయిస్టులు ఎదురుపడ్డారని తెలిసింది. తొలుత మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు ఏకే 47లు దొరికాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఇన్​చార్జి ఎస్పీ సత్యనారాయణ హుటాహుటిన కాగజ్ నగర్ కు చేరుకున్నారు. అయితే మావోయిస్టు జిల్లా కార్యదర్శి మైలారపు ఆడేల్లు అలియస్ భాస్కర్, ఆయన భార్య కంతి లింగవ్వతోపాటు మరో నలుగురు మావోయిస్టులను పోలీసులు శనివారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. దానికితోడు ఘటనా స్థలంలో ఏకే 47లు దొరకడంతో చనిపోయినవారు అగ్రనేతలు ఉండి ఉంటారని భావిస్తున్నారు.