మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు..సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నారని ఆరోపణలు

మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు..సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నారని ఆరోపణలు
  • మల్లారెడ్డి, కామినేని, ఎస్‌‌వీఎస్‌‌, 
  • ఎమ్‌‌ఎన్‌‌ఆర్‌‌‌‌, ప్రతిమ, మమత సహా
  • మరో నాలుగు కాలేజీల్లో తనిఖీలు
  • 7 జిల్లాల్లోని 22 ప్రాంతాల్లో సోదాలు
  • మనీ లాండరింగ్​ యాక్ట్​ కింద ఆధారాల సేకరణ
  • నేడూ కొనసాగనున్న రెయిడ్స్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్(ఈడీ) నజర్ పెట్టింది. పీజీ మెడికల్ సీట్లు బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేసి అక్రమంగా అమ్ముకున్నారనే ఆరోపణలతో పది మెడికల్ కాలేజీల్లో బుధవారం ఉదయం నుంచి సోదాలు ప్రారంభించింది. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి చెందిన మెడికల్ కాలేజీలతో పాటు కామినేని గ్రూప్, ఎమ్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్ కాలేజ్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌వీఎస్‌‌‌‌‌‌‌‌ సొసైటీ, ప్రతిమ, మమత, మెడిసిటీ, చల్మెడ ఆనందరావు కాలేజ్‌‌‌‌‌‌‌‌, డెక్కన్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీలపై ఏకకాలంలో రెయిడ్స్ చేసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లోని 22 ప్రాంతాల్లో తనిఖీలు జరిపింది. 

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్‌‌‌‌‌‌‌‌ (పీఎమ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌) యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద ఆధారాలు సేకరించింది. 45 పీజీ మెడికల్ సీట్లను బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేసి అక్రమంగా అమ్ముకున్నారని కాళోజీ యూనివర్సిటీ అధికారులు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించింది. రెయిడ్స్ జరుగుతున్న ప్రాంతంలోకి అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌, అకౌంట్స్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది మినహా ఇతరులను అనుమతించలేదు. ఈ తనిఖీల్లో కంపెనీల మెయిన్ సర్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హార్డ్‌‌‌‌‌‌‌‌డిస్క్‌‌‌‌‌‌‌‌లు, బ్యాంక్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్‌‌‌‌‌‌‌‌, ఆడిట్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. రెయిడ్స్ గురువారం కూడా కొనసాగే చాన్స్ ఉంది.

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  ఎస్‌‌‌‌‌‌‌‌వీఎస్ మెడికల్ సొసైటీ

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎస్‌‌‌‌‌‌‌‌వీఎస్‌‌‌‌‌‌‌‌ మెడికల్ కాలేజీ సొసైటీ, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రతిమ కార్పొరేట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు చేసింది. మెడికల్ సొసైటీలకు చెందిన మెయిన్ కార్పొరేట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు చేసింది. ఎస్‌‌‌‌‌‌‌‌వీఎస్‌‌‌‌‌‌‌‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీలు, సీట్లు, ఫీజులకు సంబంధించిన రికార్డులను ఈడీ అధికారులు పరిశీలించారు. ఐటీ చెల్లింపులతో పాటు ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఫీజుల ద్వారా సేకరించిన నిధులను మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌ చేశారనే అనుమానంతో రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. కార్పొరేట్ ఆఫీసుల్లోని హార్డ్‌‌‌‌‌‌‌‌డిస్క్‌‌‌‌‌‌‌‌లు, ఆడిట్ రికార్డ్‌‌‌‌‌‌‌‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. నిధుల దారిమళ్లింపు వివరాలతో బ్యాంక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్లను పరిశీలించింది.

కామినేని గ్రూప్ ఆఫ్  మెడికల్ కాలేజీల్లో తనిఖీలు

కింగ్‌‌‌‌‌‌‌‌ కోఠిలోని కామినేని కార్పొరేట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌, కామినేని సూర్యనారాయణ ఇంటితో పాటు ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని కామినేని ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ మెడికల్ సైన్స్‌‌‌‌‌‌‌‌లో సోదాలు చేశారు. ప్రతి ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో రెండు టీమ్స్‌‌‌‌‌‌‌‌ తనిఖీలు చేశాయి. కామినేనికి సంబంధించిన మొత్తం నాలుగు మెడికల్ కాలేజీలకు చెందిన డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌ ఇండ్లు, ఆఫీస్‌‌‌‌‌‌‌‌ల్లో ఏకకాలంలో రెయిడ్స్ సాగాయి. ఫిల్మ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీలకు చెందిన కార్పొరేట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో సోదాలు నిర్వహించింది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కాలేజీలు వాటి అనుబంధ సంస్థలు, డైరెక్టర్లు వారి కుటుంబ సభ్యుల ఇండ్లలోను తనిఖీలు చేసింది. మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లా షామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌లోని మెడిసిటీ మెడికల్ కాలేజ్‌‌‌‌‌‌‌‌, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌‌‌‌‌‌‌‌లో సోదాలు జరిగాయి.

సీట్ల బ్లాకింగ్‌‌‌‌‌‌‌‌, భారీ ఫీజులు, డొనేషన్స్‌‌‌‌‌‌‌‌తో మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌!

మెడికల్ కాలేజీల్లో ఫీజులు, డొనేషన్స్ రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు సీట్లు బ్లాక్ చేసి భారీ రేట్లకు అమ్ముకుంటున్నారని పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. ఏటా సీట్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతూ.. హవాలా రూపంలో మనీలాండరింగ్ చేస్తున్నట్లు ఈడీ అనుమానిస్తున్నది. ఈ క్రమంలోనే ఈసీఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నది. మొదటి రోజు తనిఖీల్లో కాలేజీలు, కార్పొరేట్ ఆఫీసుల్లోని రికార్డ్‌‌‌‌‌‌‌‌లను పరిశీలించారు. కాలేజీలు ఏర్పాటు చేసిన నాటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌‌‌‌‌ వివరాలు సేకరించారు. ప్రధానంగా మెడికల్ కాలేజీల చైర్మన్‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌ వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న కంపెనీల వివరాలను ఈడీ సేకరిస్తున్నట్లు తెలిసింది. మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సీట్లు, డొనేషన్స్‌‌‌‌‌‌‌‌, ఫీజుల రూపంలో కలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన డబ్బుకు సంబంధించిన వివరాలను రాబడుతున్నది. సొసైటీలతో అనుబంధంగా కొనసాగుతున్న కంపెనీల వివరాలను సేకరిస్తున్నది. వీటికి సంబంధించిన ఆడిట్ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనుమానిత ట్రాన్సాక్షన్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన డాక్యుమెంట్లను అందించాలని ఆదేశించినట్లు తెలిసింది.