
- ఇంజినీరింగ్ మినిమమ్ ఫీజు 50 వేలు
- ఈ నెలాఖరులోగా ఖరారయ్యే చాన్స్
- కసరత్తు చేస్తున్న టీఏఎఫ్ఆర్సీ
- అత్యధికంగా 4 కాలేజీల్లో రూ.2 లక్షలకు పైనే
- సగానికి పైగా కాలేజీల్లో లక్షకు పైగా ఫీజు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే మూడేండ్లకు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు చివరి దశకు చేరింది. ఇప్పటికే మెజార్టీ ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ఫైనల్ కాగా, కొన్నింటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈసారి మినిమమ్ ఫీజును రూ.50 వేలు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. మరోపక్క ఫీజు అత్యధికంగా 2 లక్షలు దాటనున్నది. ఈనెలాఖరులో ఇంజినీరింగ్ ఫీజులపై స్పష్టత రానున్నది.
స్టేట్ లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025–26, 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు గానూ ఫీజులను నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇప్పటికే పలు మార్లు సమావేశమైంది. ఫీజుల ఖరారుకు టీఏఎఫ్ఆర్సీకి 157 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, ఆయా కాలేజీల పత్రాలను పరిశీలించారు. దీంట్లో ఫీజుల ఖరారు ఓ కొలిక్కి వచ్చింది. సర్కారు కాలేజీలలో ప్రస్తుతం మినిమమ్ ఫీజు రూ.35వేలు ఉండగా, దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయించారు.
ప్రైవేటు కాలేజీల్లో మినిమమ్ ఫీజు రూ.45వేలు ఉండగా, దాన్ని రూ.50 వేలకు పెంచాలని టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు రెడీ చేసింది. దాదాపూ ఇది ఖరారయ్యే చాన్స్ ఉంది. అత్యధికంగా 4 ప్రైవేట్ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ. 2 లక్షలకు పైగా ఫీజులు ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మేనేజ్మెంట్లతో జరిగిన సమావేశంలోనూ ఆయా యాజమాన్యాలకు తెలిపి, వారితో ఒప్పుకున్నట్టు టీఏఎఫ్ఆర్సీ అధికారులు సంతకాలూ చేయించుకున్నారు. ఇక అధికారికంగా ప్రకటించడమే ఉంది.
సగం కాలేజీల్లో లక్ష పైనే..
గత బ్లాక్ పీరియడ్లో 38 కాలేజీల్లో లక్షకుపైగా ఫీజు డిసైడ్ చేశారు. ఈ సారి ఆ సంఖ్య డబుల్ అయ్యే అవకాశాలున్నాయి. గతంలో రూ.80వేలకు పైగా ఫీజులున్న చాలా కాలేజీల్లో రూ.లక్షకు పైగా ఫీజులు ఉండే చాన్స్ ఉంది. ఇప్పటికే పలు కాలేజీలు సర్కారు పెద్దలను కలిసి.. ఫీజులు పెంచాలని విజ్ఞప్తులు చేస్తున్నాయి. 25 కాలేజీలు మినహా.. మిగిలిన కాలేజీలు భారీగా ఫీజులు పెంచాలని టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదనలు ఇచ్చాయి. వీటిపై టీఏఎఫ్ఆర్సీ 3 సార్లు సమావేశమై.. చర్చలు చేసింది.
సుమారు 40 కాలేజీల్లో ఫీజులపై కమిటీలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో ఆయా కాలేజీలపై మరోసారి సమావేశంలో చర్చించాలని డిసైడ్ అయ్యారు. అప్పటి వరకూ కాలేజీలు ఇచ్చిన వివరాలపై మరోసారి వెరిఫై చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ నెలాఖరులోపు ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేయాలని సర్కారు భావిస్తున్నది. టీఏఎఫ్ఆర్సీ ఇచ్చిన ఫీజుల వివరాలతో ప్రభుత్వం అధికారికంగా జీవో రిలీజ్ చేయనున్నది.