అడిలైడ్లో టీమిండియా రికార్డ్స్

అడిలైడ్లో టీమిండియా రికార్డ్స్

 టీ20 వరల్డ్ కప్లో  దుమ్మురేపిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. సూపర్ 12లో ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి గ్రూప్-2 టాపర్‌గా నిలిచిన భారత జట్టు..10వ తేదీన రెండో సెమీస్లో ఇండ్లాండ్ ను ఢీకొట్టనుంది.  అడిలైడ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్ చేరాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.

అడిలైడ్లో  టీమిండియా రికార్డ్స్..
అడిలైడ్లోని ఓవల్ గ్రౌండ్ లో టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. ఇక్కడ భారత జట్టు రెండు టీ20లు ఆడితే రెండింటిలోనూ గెలవడం విశేషం. 2021లో టీమిండియా తొలి టీ20 ఆడగా అందులో విజయం సాధించింది. ఇక తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ టీమిండియా బంగ్లాదేశ్తో ఇక్కడ మ్యాచ్ ఆడింది. ఇందులోనూ భారత జట్టే గెలిచింది. నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం  5 పరుగులతో టీమిండియా గెలిచింది. అటు ఈ పిచ్పై 15 వన్డేలు ఆడితే 9 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. 

ఇంగ్లాండ్కు  చెత్త రికార్డు
అడిలైడ్‌‌లో ఇంగ్లండ్‌కు చెత్త రికార్డు ఉంది. అడిలైడ్‌లో 17 వన్డేలు ఆడిన ఇంగ్లాండ్ కేవలం 4 మ్యాచ్‌‌ల్లోనే గెలిచి 12 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక్కడ  ఆ జట్టు  ఒక టీ20 మ్యాచ్ ఆడింది.  2011లో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. చివరగా ఇంగ్లాండ్ 2015 వన్డే ప్రపంచకప్‌లో ఓవల్ వేదికగా  బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడింది. ఈ గేమ్లో  ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది.

అడిలైడ్ బాస్ కోహ్లీ 
ఓవల్ పిచ్పై కోహ్లీకి మెరుగైన రికార్డ్ ఉంది.  ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇక్కడ 10 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 14 ఇన్నింగ్స్‌ల్లో 907 పరుగులు సాధించాడు.  ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. అడిలైడ్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ...ఫస్ట్ మ్యాచ్లో  90 పరుగులు, రెండో మ్యాచ్లో  64 పరుగులు సాధించాడు. ఈ వేదికపై కోహ్లీ 90.7 సగటుతో పరుగులు చేయడం విశేషం. 

టీమిండియాదే పై చేయి..
టీ20ల్లో ఓవరాల్గా  ఇండియా, ఇంగ్లండ్ ఇప్పటి వరకు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో  భారత్ 12 సార్లు విజయం సాధిస్తే.. ఇంగ్లండ్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. టీ20 వరల్డ్ కప్లో మూడు సార్లు(2007, 2009, 2012) ఇరు జట్లు ఢీకొట్టుకున్నాయి. ఇందులో  భారత్ రెండు సార్లు గెలిస్తే..ఇంగ్లండ్ ఒక్కసారి  విజయం సాధించింది.