IND vs ENG 2025: లార్డ్స్ టెస్టులో టీమిండియాకు పట్టు.. 100 లోపే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

IND vs ENG 2025: లార్డ్స్ టెస్టులో టీమిండియాకు పట్టు.. 100 లోపే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. నాలుగో రోజు ఇంగ్లాండ్ ను రెండో ఇన్నింగ్స్ లో వణికిస్తోంది. సిరాజ్ రెండు వికెట్లతో చెలరేగితే.. ఆకాష్ దీప్, నితీష్ రెడ్డి కీలక సమయాల్లో వికెట్లు సంపాదించి మ్యాచ్ ను భారత్ వైపుకు తిప్పారు. ఫలితంగా నాలుగో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 92 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్ లో రూట్ (17), స్టోక్స్ (2) ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్, నితీష్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు. 

వికెట్ నష్టపోకుండా 2 పరుగులతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే బెన్ డకెట్ వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్ లో మిడ్ ఆన్ లో షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఊపులో ఒక ఇన్ స్వింగ్ డెలివరీతో పోప్ ను ఎల్బీ డబ్ల్యూ రూపంలో ఔట్ చేశాడు. క్రీజ్ లో ఉన్నంత వరకు ఇబ్బంది పడిన క్రాలీ నితీష్ బాల్ కు చిక్కాడు. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ ను రూట్, బ్రూక్ ఆదుకునే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా బ్రూక్ టీమిండియా బౌలర్లపై ఎటాకింగ్ షాట్స్ ఆడుతూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. 37 పరుగుల స్వల్ప భాగస్వామ్యం తర్వాత 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆకాష్ దీప్ బ్రూక్ ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్టోక్స్, రూట్ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా.. ఆతర్వాత ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులకు ఆలౌట్ అయింది.