V6 News

వర్సిటీ ఇమేజ్​ను మరింత పెంచాలె : వైస్ చాన్సలర్ రవీందర్ యాదవ్

వర్సిటీ ఇమేజ్​ను మరింత పెంచాలె : వైస్ చాన్సలర్ రవీందర్ యాదవ్
  • జియోఫిజిక్స్ డిపార్ట్‌‌మెంట్‌‌కు రూ.60 లక్షల విరాళం అందజేసిన పూర్వ విద్యార్థి

ఓయూ, వెలుగు: ఓయూ అభివృద్దిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములై వర్సిటీ ఇమేజ్​ను మరింత పెంచాలని వైస్ చాన్సలర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ఓయూ జియోఫిజిక్స్​ విభాగంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్​కు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. టీచింగ్, లెర్నింగ్‌‌ మెథడ్స్, రీసెర్చ్‌‌ రంగంలో అత్యున్నత ప్రమాణాలను అభివృద్ధి చేశామని, వర్సిటీలో ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

ఇప్పటి వరకూ ఉద్యమాల గడ్డగా ఉన్న ఓయూ.. ఇప్పుడు ఉద్యోగాల అడ్డాగా మారిందన్నారు. అదే విధంగా పూర్వ విద్యార్థులు వారి లీజర్‌‌‌‌ టైంలో జియోఫిజిక్స్ విభాగానికి వస్తూ, ప్రస్తుతం చదువుతున్న స్టూడెంట్లతో ఆలోచనలను పంచుకోవాలని సూచించారు. జియోఫిజిక్స్ విభాగంలో చదువుకొని ఆయిల్, గ్యాస్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌‌‌‌గా పదవీ విరమణ చేసిన పూర్వ విద్యార్థి ఎన్. చంద్రబాబు  రూ.60 లక్షల చెక్కును డిపార్ట్​మెంట్​కు అందజేశారు. ఈ మనీ ఫిక్స్‌‌డ్​ డిపాజిట్ చేసి మెరిట్ స్టూడెంట్స్‌‌కు స్కాలర్​షిప్​గా అందించాలని చంద్రబాబు కోరారు. కార్యక్రమంలో సైన్స్​కాలేజీ ప్రిన్సిపల్​ప్రొఫెసర్​వీరయ్య, ఎంజీఆర్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ గుప్తా, ఏఎండీ డైరెక్టర్ డాక్టర్ శరవణన్, ప్రొఫెసర్ మురళీ తదితరులు పాల్గొన్నారు.