ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు

హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో 19వేల టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఉపాధ్యాయ ఖాళీలపై బయట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. టీచర్లకు ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించిన ట్రైనింగ్ను వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ అనేక రంగాల్లో మార్పులకు నాంది పలుకుతున్నారని, అందులో భాగంగా విద్యాశాఖలో కూడా ఎన్నో మార్పులు చేశారని సబిత అన్నారు. 

80వేల మంది టీచర్లకు ట్రైనింగ్
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సర్కారీ బడుల అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుందన్న మంత్రి.. ఇందుకోసం 80వేల మంది టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నామని అన్నారు. కరోనా అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 3లక్షల మంది విద్యార్థులు జాయిన్ అయ్యారని స్పష్టం చేశారు. 

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్పు.!
ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పు చేయాల్సి ఉందని మంత్రి సబిత చెప్పారు. జేఈఈ పరీక్షా తేదీల్లో మార్పు చేసినందున అందుకు అనుగుణంగా ఇంటర్ ఎగ్జామ్స్ డేట్స్ మార్చాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలోనే నిర్ణయం తీసుకుని కొత్త షెడ్యూల్ ప్రకటించనున్నట్లు చెప్పారు.