- ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదంపై హర్షం
- మూసీ వెంట ఆట స్థలాలు నిర్మించాలని సూచన
ముషీరాబాద్, వెలుగు: చెరువులు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం తెచ్చిన ‘హైడ్రా’కు పూర్తి మద్దతు తెలుపుతున్నామని పర్యావరణ పరిరక్షక అభివృద్ధి మండలి (ఎన్పీడీసీ) తెలిపింది. హైడ్రా ఆర్డినెన్స్ఈను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడంపై ఎన్పీడీసీ హర్షం వ్యక్తం చేసింది.
ఎన్పీడీసీ అధ్యక్షుడు ఎస్సీహెచ్ రంగయ్య ఆదివారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా పర్యావరణ ఉద్యమకారులు, ప్రేమికులు ఆశించిన చెరువుల సంరక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రాను తీసుకురావడం సంతోషకరమన్నారు.
చెరువుల ఆక్రమణ వల్ల మనుషులతో పాటు జంతువులు కూడా మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా జరిగిన ప్రకృతి హననాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ద్వారా ఆపే ప్రయత్నం చేస్తుంటే కొందరు రాజకీయ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు.
చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ‘‘హైడ్రా కూల్చివేతల కారణంగా బాధితులకు సహాయం చేయాలని ప్రభుత్వంపై రాజకీయ నాయకులు ఒత్తిడి చేయాలి తప్ప తమ లబ్ధి కోసం హైడ్రాను అడ్డుకునే ప్రయత్నం చేయరాదు.
హైదరాబాద్ మహానగరంలో పర్యావరణ పరిరక్షణలో హైడ్రా కీలకం కానుంది. మూసీ సుందరీకరణ, చెరువుల ప్రక్షాళనతో కాలుష్యం నుంచి సిటీ బయటప డుతుంది.
పర్యావరణ నాశనాన్ని ఇకనైనా ఆపకపోతే భావితరాలు మనల్ని క్షమించవు. ఆ భావితరాల్లో మన వారసులు కూడా ఉంటారన్న నిజాన్ని మనం మరువరాదు” అని రంగయ్య పేర్కొన్నారు.
మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ ఒడ్డున నగర విద్యార్థులకు ఆటస్థలాలు , సామాన్య జనం సేదతీరేందుకు పార్కులు నిర్మించాలని సీఎంకు ఆయన విజ్ఞప్తి చేశారు.