హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్ సెట్–2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని ఎప్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్, ఫీజుల వివరాలను ఆయన ప్రకటించారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల19 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 గా, మిగిలిన అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు రూ.900 గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, గడువులోగా అప్లై చేసుకోవాలని కన్వీనర్ సూచించారు. కాగా, అగ్రికల్చర్, ఫార్మసీ స్ర్టీముకు మే 4, 5 తేదీల్లో, ఇంజినీరింగ్ స్ట్రీము విద్యార్థులకు మే 9, 10, 11 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
