- తొలి విడతగా హైదరాబాద్ మెట్రో జోన్‌లోని 4 ప్రధాన సర్కిల్స్, 11 డివిజన్లలో..
- వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు సర్కారు సిద్ధం
- రెండేండ్లలోనే ప్రాజెక్ట్ పూర్తి చేసేలా నిబంధన
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలో కరెంట్ సమస్యలకు ఇక ఫుల్స్టాప్ పడనుంది. బిల్డింగ్స్ పైకప్పులకు తాకుతూ ఉండే విద్యుత్ స్తంభాలు, ఇంటర్నెట్, కేబుల్ టీవీల వైర్లు పూర్తిగా మాయంకానున్నాయి. కరెంట్ పోల్స్ లేని రోడ్లు దర్శనమివ్వనున్నాయి. రూ.5,756 కోట్లతో అండర్గ్రౌండ్ కేబుల్ఏర్పాటుకు సంబంధించిన రివైజ్డ్డీపీఆర్కు తెలంగాణ ఈఆర్సీ ఆమోదం తెలిపింది.
వారం రోజుల్లో టెండర్లు పిలవడానికి సర్కారు ఫైల్ రెడీ చేసింది. కేవలం రెండేండ్లలో పనులు పూర్తి చేసేలా నిబంధన పెట్టింది. పాత డీపీఆర్‌లో మార్పులు చేయడంతో రూ.1,705 కోట్ల నిధులు పెరిగాయి. జీహెచ్‌ఎంసీకి ఎలాంటి భారం పడకుండా రోడ్లపై మట్టిపూడ్చే బాధ్యత కాంట్రాక్టర్లకే అప్పగింస్తూ డీపీఆర్ఫైనల్చేశారు.
కొత్త డీపీఆర్కు ఆమోదం..
రూ.5,756 కోట్లతో తయారు చేసిన కొత్త డీపీఆర్కు తెలంగాణ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెగా సిటీలో ఒకేసారి కాకుండా, పైలట్ ప్రాజెక్ట్ కింద అత్యధిక విద్యుత్ డిమాండ్, ట్రాఫిక్, జనసాంద్రత గల మెట్రో జోన్ పరిధిలోని 4 ప్రధాన సర్కిళ్లను తొలి విడత డీపీఆర్‌లో చేర్చారు. బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలోని 11 డివిజన్లలో అండర్గ్రౌండ్ (యూజీ) కేబ్లింగ్ చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు మొదటగా రూ.4,051 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పనులు చేశాక మట్టి పూడ్చే బాధ్యత ఎవరిది? అనే అంశంపై స్పష్టత లేదు. దీంతో సదరన్ డిస్కమ్అధికారులు ఓ కంపెనీతో డిటైల్డ్ప్రాజెక్ట్రిపోర్ట్(డీపీఆర్) రెడీ చేసి ఈఆర్సీ ఆమోదానికి పంపించారు. రివైజ్డ్డీపీఆర్లో రూ.1,705 కోట్లు పెరిగినప్పటికీ, జీహెచ్ఎంసీపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
'రింగ్' వ్యవస్థ ఏర్పాటు..
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సాంకేతిక వ్యవస్థ ‘రింగ్ మెయిన్ సిస్టమ్’. నగరంలో ఎక్కడా విద్యుత్ నిలిచిపోకుండా ఉండేందుకు గ్రిడ్ తరహాలో 'రింగ్' వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఒక ప్రాంతానికి విద్యుత్ అందించే కేబుల్ ఏదైనా కారణం చేత దెబ్బతింటే వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా కేవలం కొద్ది సెకన్లలోనే ఆటోమేటిక్‌గా విద్యుత్ పునరుద్ధరిస్తారు. రోడ్ల పక్కన ఉండే పెద్ద పెద్ద ఓపెన్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో అత్యాధునిక ఆర్ఎండీయూ బాక్సులను ఏర్పాటు చేస్తారు. ఇవి చిన్న సైజులో, పూర్తిగా లాక్ చేయబడి ఉంటాయి. వర్షం పడినా ఎలాంటి ప్రమాదం జరగకుండా వాటర్ ప్రూఫ్‌గా ఉంటాయి.
వీటి ద్వారా విద్యుత్ సరఫరాను రిమోట్ కంట్రోల్ (స్కాడా సిస్టమ్)తో ఆఫీస్ నుంచే నియంత్రిస్తారు. కస్టమర్ సర్వీస్ కనెక్షన్లకు సంబంధించిన భూగర్భ కేబుల్స్ అన్నీ రోడ్డు పక్కన ఉన్న ఆర్ఎండీయూ బాక్సుల వరకు వస్తాయి. అక్కడి నుంచి వినియోగదారుల ఇండ్లకు, దుకాణాలకు విద్యుత్ మీటర్ల వరకు కొత్తగా ఇన్సులేటెడ్ సర్వీస్ వైర్ల ద్వారా సురక్షితమైన కనెక్షన్లు ఇస్తారు.
ఇంటర్నెట్, టెలికాం డక్ట్స్ నిర్మాణం..
అండర్‌గ్రౌండ్‌లో విద్యుత్ కేబుళ్లు వేసేటప్పుడే వాటితో పాటు ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు, జియో, ఎయిర్‌టెల్, ఇతర ప్రభుత్వ టీ-ఫైబర్ సంస్థల కోసం ప్రత్యేక ప్లాస్టిక్ పైపులను (డక్ట్స్) భూమిలోనే వేస్తారు. భవిష్యత్‌లో ఇంటర్నెట్ వైర్లు వేయాలన్నా రోడ్లను తవ్వాల్సిన పని లేకుండా, ఈ డక్ట్స్ ద్వారానే వైర్లను లాక్కునే వీలుంటుంది. ఈ పనుల ద్వారా హైదరాబాద్ మెట్రో పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల పేలుళ్లు, తీగలు తెగిపడటం వంటి సమస్యలను అరికట్టవచ్చని అధికారులు అంచనా వేశారు.
రెండేండ్లలో పనులు పూర్తి చేసేలా నిబంధన..
అండర్గ్రౌండ్ కరెంట్పనులకు సంబంధించిన టెండర్లు పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫైల్రెడీ చేసింది. ఇప్పటికే ఈఆర్సీ ఆమోదం తెలపడంతో వారం రోజుల్లో టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫైనల్ డీపీఆర్ప్రకారం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు కేవలం రెండేండ్లలో పనులు పూర్తి చేసేలా నిబంధన పెట్టారు. ఈ పనులు జరిగే సమయంలో జీహెచ్‌ఎంసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి పూడ్చే బాధ్యతలను సైతం కాంట్రాక్ట్ సంస్థలకే అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలో పనులు..
నాలుగు సర్కిళ్లలో కలిపి 33 కేవీ లైన్లు సుమారు 300 కి.మీ, 11 కేవీ లైన్లు సుమారు 30 వేల కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ కేబుల్‌పనులు జరుగుతాయి. ఇందులో బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్ల పరిధిలోని ప్రాంతాల్లో రోడ్లు వెడల్పుగా ఉండటంతో ఎక్కువ భాగం ట్రెంచ్‌లెస్ టెక్నాలజీ ద్వారా 33 కేవీ, 11 కేవీ మెయిన్ లైన్లను భూగర్భంలోకి మారుస్తారు. హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సర్కిల్ పరిధిలోని పాతబస్తీ ప్రాంతాల్లో ఇరుకైన గల్లీలు, జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల రోడ్లు తవ్వడం అసాధ్యమైన చోట్ల ఓవర్‌హెడ్ స్తంభాలపైనే పాత తీగలను తొలగించి, పూర్తిగా ఇన్సులేట్ చేసిన ఏరియల్ బంచ్డ్ (ఏబీ) కేబుళ్లను అమర్చుతారు. దీనివల్ల ఇండ్లపై తీగలు పడినా షార్ట్ సర్క్యూట్ అయ్యే చాన్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం
హైదరాబాద్ మెట్రో జోన్ పరిధిలో చేపట్టే అండర్గ్రౌండ్ కరెంట్ కేబుల్ పనులకు సంబంధించిన ఫైల్ రెడీ చేశాం. ఇప్పటికే రూ.5,756 కోట్లతో తయారు చేసిన కొత్త డీపీఆర్కు తెలంగాణ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. అంతా ఆన్లైన్లో పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తాం.- జితేష్ వి.పాటిల్, సదరన్ డిస్కమ్ సీఎండీ, హైదరాబాద్
