రైతులకు ఏం చేశారని రైతు మేళాలు? : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రైతులకు ఏం చేశారని రైతు మేళాలు? : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  •     మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌‌పై ఎర్రబెల్లి దయాకర్ ​ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతులకు ఏం చేశారని రైతు మేళాలు నిర్వహిస్తున్నారో చెప్పాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్​రావు, ఉత్తమ్​కుమార్​రెడ్డిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బస్సుల్లో తీసుకొచ్చి మేళా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మంత్రులు తుమ్మల, ఉత్తమ్ ఒక్క గింజ ధాన్యమైనా కొన్నారా అని ప్రశ్నించారు. బోనస్​ అయినా ఇచ్చారా అని మండిపడ్డారు. 

గురువారం ఆయన తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడితే కేటీఆర్​పై కేసులు పెట్టడమేంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు. కేసీఆర్​పై రేవంత్​ అడ్డగోలుగా మాట్లాడారని..మరి రేవంత్​పై ఎన్ని కేసులు పెట్టాలన్నారు. బీఆర్ఎస్​ హయాంలో మంత్రులు కల్లాల్లో తిరిగి రైతుల పంటను కొనుగోలు చేశారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్​ హయాంలో ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు. 

రైతులు ఇండ్లలో పడుకునే పరిస్థితి లేకుండా పోయిందని, ధాన్యం కుప్పల మీద పడుకుంటున్నారని పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్​ అమలవుతుందా లేదా రాహుల్​ గాంధీ చెప్పాలని సవాల్ విసిరారు. రైతుల బాధలు తెలియని వ్యక్తి నాయిని రాజేందర్​రెడ్డి అని సత్యవతి రాథోడ్​ అన్నారు. రేవంత్​ రెడ్డి అన్న మాటలు గుర్తు చేశామని, తామేం ఎక్కువగా మాట్లాడలేదని చెప్పారు. కేటీఆర్​ వరంగల్​ సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేసిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.