సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఎస్కేప్

సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఎస్కేప్

సోషల్ మీడియా పోలీసులకు తలనొప్పిగా మారింది. కేసుల దర్యాప్తులో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. నేరగాళ్లు పోలీసులకు దొరకకుండా ఎస్కేప్ కావడానికి సోషల్ మీడియా పరోక్షంగా తోడ్పడుతోంది.  ఇందుకు కారణం ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు నిందితుల విజువల్స్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే.  సీన్ ఆఫ్ అఫెన్స్ కు పోలీసులు వెళ్లే లోపు క్రైమ్ సీన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో తమ సమాచారం బయటకి రావడంతో పోలీసులకు చిక్కకుండా నేరగాళ్లు తప్పించుకుంటున్నారు.  చైన్ స్నాచర్లు, ప్రాపర్టీ అఫెండర్స్,మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పక్కాస్కెచ్ వేసి ఎస్కేప్ అవుతున్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ను ఫాలో అవుతూ సినీ ఫక్కీలో కేసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు.

లోకల్ దొంగలకు వాటాలతో

అంతర్రాష్ట్ర ముఠాలకు స్థానిక దొంగలు షెల్టర్ ఇస్తున్నారు. నేరం చేసిన తర్వాత పారిపోయేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు. సిటీకి వచ్చే దొంగల ముఠాలు పోలీసులకు చిక్కకుండా పారిపోయేలా స్థానికంగా ఉన్న దొంగలు వారికి సహకరిస్తున్నట్టు కేస్ స్టడీస్ లో గుర్తించారు. ఇందుకోసం చోరీ సొత్తులో వాటాలు ఖర్చులకు డబ్బులను లోకల్ దొంగలు వసూలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇలా సిటీ రోడ్లు,సీసీ కెమెరాలపై అంతర్రాష్ట ముఠాలను లోకల్ దొంగలు అలర్ట్ చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో చైన్ స్నాచర్స్,నొయిడా గ్యాంగ్స్ గతంలో ఇలాంటి చోరీలు చేసి ఎస్కేప్ అయ్యాయి. సిటీలో పోలీసుల మూవ్ మెంట్స్ ను గమనిస్తూ రెక్కీ వేసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు.

పంజాగుట్ట హత్య కేసులో        

పంజాగుట్టలో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో నిందితుడు కోగంటి సత్యం పోలీసులను తప్పుదారి పట్టించాడు. ఈ నెల 5న సాయంత్రం సత్యం తిరుపతి నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చాడు.   సోమాజిగూడలోని ఓ లాడ్డిలో సత్యం షెల్టర్ తీసుకున్నాడు.  6వ తేదీ పంజాగుట్టలో రాంప్రసాద్ హత్య జరిగింది. లాడ్జిలో టీవీ ముందు కూర్చుని రాంప్రసాద్ పై దాడి జరిగిన తీరును సత్యం గమనించాడు. ఆరోజు తాను తిరుపతిలోని ఓ గెస్ట్ హౌజ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో తన మిత్రుల ద్వారా ప్రచారం చేయించాడు. ఇందులో భాగంగానే శ్యామ్ ప్రసాద్ ను రంగంలోకి దించి మీడియాలో ఇంటర్వ్యూలు ఇప్పించాడు. కానీ సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా రాంప్రసాద్ హత్య జరిగిన రోజు సత్యం పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని కేసు నుంచి తప్పించుకోవాలని సత్యం యత్నించినట్లు పోలీసులు తేల్చారు.

యాక్సిస్ బ్యాంక్ ఏటీఏం చోరీ

వనస్థలిపురం పనామా గోడౌన్ వద్ద మే 7న జరిగిన యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం క్యాష్ చోరీ కేసులో రాంజీనగర్ గ్యాంగ్ ఇలాంటే స్కెచ్ వేసింది. పట్టపగలే చోరీ చేసి తప్పించుకునేందుకు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాలనే ఫాలో అయ్యింది. కస్టోడియన్ వెహికల్ నుంచి రూ.58.97లక్షలను దోచుకెళ్తూ… సీసీ కెమెరాలు, పోలీస్ చెకింగ్స్ కి కూడా భయపడకుండా ఎస్కేప్ అయ్యారు. ఈ కేసులో రాంజీనగర్ గ్యాంగ్ సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో దొంగల ముఠా అలర్ట్ అయ్యింది. తమను పోలీసులు గుర్తించారని తెలుసుకున్న ఈ గ్యాంగ్ సిటీ విడిచి పారిపోయింది. గతంలోనూ పలు చోరీ కేసుల్లో అరెస్టయిన రాంజీనగర్ గ్యాంగ్ సభ్యులు సొంతూళ్లకు వెళ్ళకుండా ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. ఈ కేసులో దొంగల సీసీ ఫుటేజ్ ను ముసారాంబాగ్ లోని సులభ్ కాంప్లెక్స్ వద్ద చివరి సారిగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దొంగల ముఠా ఎటువైపు వెళ్ళిందో ఆధారాలు దొరకలేదు.

సవాల్ విసిరిన చైన్ స్నాచర్లు

గతేడాది డిసెంబర్ లో వరుస చైన్ స్నాచింగ్స్ చేసిన దొంగల ముఠా  పోలీసులకు సవాల్ విసిరింది. ఈ ముఠాలో సభ్యుడైన చింతమల్ల ప్రణీత్ కుమార్ చౌదరి వనస్థలిపురం చెందిన వాడు. నోయిడాకు చెందిన మోను వాల్మీకి(30) చోక(28) అనే దొంగలతో ప్రణీత్ కి ఢిల్లీ జైల్లో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రణీత్ హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్స్ కి స్కెచ్ వేశాడు. ఈ ముఠా గత డిసెంబర్ లో 15 గంటల్లో 11 చైన్ స్నాచింగ్స్ చేసి తప్పించుకుని తిరిగింది. ఈ కేసులో స్థానికుడైన ప్రణీత్ పోలీసుల మూవ్ మెంట్స్ ను కనిపెట్టేవాడు. సీసీ ఫుటేజ్ ల ఆధారంగా చైన్ స్నాచర్ల కోసం పోలీసులు వెతుకుతున్నారని గుర్తించాడు. నాంపల్లిలోని ఓ లాడ్జిలో షెల్టర్ తీసుకున్న మోను,చోకను అక్కడి నుంచి కాచిగూడ తరలించాడు. ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా అంతకంటే ఒకరోజు ముందుగానే మోను,చోకను ప్రణీత్ సిటీ దాటించాడు. ఆ తర్వాత టవర్ లొకేషన్ ఆధారంగా ప్రణీత్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో కూడా సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాలను ఫాలో అవుతూనే ప్రణీత్ చోరీలు,ఎస్కేపింగ్ కి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇన్వెస్టిగేషన్ లో గోప్యత అవసరం

ఇలాంటి కేసుల్లో విజువల్స్,ఫొటోలు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియలో రావడంతో దర్యాప్తులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కిడ్నాప్, మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కొంత సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ..దోపిడీ దొంగలు, చైన్ స్నాచర్లు,ఇతర నేరగాళ్లు ప్రసార మాధ్యమాల్లో తమ ఉనికి బయట పడటంతో సిటీ వదిలి పారిపోతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సీసీ ఫుటేజ్,ఫొటోలు కేసు దర్యాప్తు కంటే ముందుగానే బయటకు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ తో దొంగలు అలర్టై పారిపోతున్నట్టు పోలీసులు గుర్తించారు.  దీంతో ఎలాంటి కేసులోనైనా సరే ఫుటేజ్ బయటకు రాకుండా గోప్యత పాటించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కేసుల దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నప్పుడే సమస్యలు తలెత్తడంతో నిందితులు చిక్కకుండా తప్పించుకుంటున్నారని కేస్ స్టడీస్ లో తేలింది.