V6 News

‘మెసర్స్ ట్రాన్సాక్షనల్ అనలిస్ట్స్’ పై ఈఎస్డీ ఫిర్యాదు

‘మెసర్స్ ట్రాన్సాక్షనల్ అనలిస్ట్స్’ పై ఈఎస్డీ ఫిర్యాదు
  •     ప్రభుత్వ డిజిటల్ డేటా అప్పగించడం లేదని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ డిజిటల్ ప్రాజెక్టుల అప్పగింతలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న మెసర్స్ ట్రాన్సాక్షనల్ అనలిస్ట్స్ సంస్థపై తెలంగాణ ఎలక్ట్రానిక్ సర్వీసెస్​ డెలివరీ(ఈఎస్‌డీ) శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం ప్రాజెక్ట్ డేటా, సోర్స్ కోడ్, ఇతర రికార్డులను కొత్తగా ఎంపికైన ప్యూర్‌వ్యూ సంస్థకు అప్పగించాల్సి ఉండగా, ఏడాదిగా కాలయాపన చేస్తున్నదని వెల్లడించింది. 

పరారీలో పలువురు సంస్థ బాధ్యులు

ప్రభుత్వానికి చెందిన డిజిటల్ డేటాను అప్పగించకుండా నమ్మకద్రోహానికి పాల్పడిన ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై సీసీఎస్​లో కేసు నమోదైంది. సంస్థ ఎండీ, సీఈఓ శ్రీనివాసరావు కాటూరితోపాటు ప్రాజెక్ట్ మేనేజర్ కిరణ్ కుమార్‌పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సంస్థలో చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్​గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసులును అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2017లో రాష్ట్ర డిజిటల్ ప్లాట్‌ఫామ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఈ సంస్థ, కాలపరిమితి ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం డేటాను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. 

కానీ, కొత్త సంస్థకు హ్యాండోవర్ చేయకుండా అడ్డుపడటమే కాకుండా, ప్రభుత్వ డేటాను తమ సొంతం అని చెప్పుకునే ప్రయత్నం చేయడం, యూజర్ డేటాను ప్రైవేట్ అప్లికేషన్‌కు మళ్లించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సదరు సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు, నష్టపరిహారం వసూలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఏసీపీ ఏ.రాంరెడ్డి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.